ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మంగళగిరి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డంతోనే కాకుండా...త‌న వ్య‌క్తిత్వంతో సుప‌రిచితుడు అయిన వ్య‌క్తి. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా ముఖ్య‌మంత్రి కుమారుడిని, సిట్టింగ్ మంత్రిని సైతం ఓడించారు. అలా త‌న పట్టును ఆయ‌న నిరూపించుకున్నారు. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. తాజాగా మ‌రో నిర్ణయంతో ఆర్కే వార్త‌ల్లోకి ఎక్కారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం.... ఎమ్మెల్యేగా త‌న ప‌ద‌వీకాలంలో వ‌చ్చే మొత్తం జీతం ప్రభుత్వానికి అంద‌జేస్తున్నట్లు ప్ర‌క‌టించి  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.


వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రభుత్వ పథకాలుకు తన వంతుగా స‌హ‌క‌రించాల‌నే ఉద్దేశంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు...మంగళగిరి ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. త‌న ఐదు సంవత్సరాల పదవీ కాలానికి సంబంధించిన జీతం  విరాళంగా అందిస్తున్న‌ట్లు తెలిపారు. `కనెక్ట్ ఆంధ్ర‌`పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి త‌న జీతం అందించాల‌ని ఈ మేర‌కు ఆర్కే ఏపీ స్పీక‌ర్‌కు శుక్ర‌వారం రాసిన లేఖ‌లో కోరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్ణ‌యాన్ని ప‌లువురు అభినందిస్తున్నారు.


కాగా, ఏపీ ముఖ్య‌మంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు ఉన్న స‌మ‌యంలో...ఆయ‌న త‌న‌యుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేశ్‌ను ఆళ్ల ఓడించిన సంగ‌తి తెలిసిందే. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో దిగిన‌ ఆళ్ల రామకృష్ణరెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపు అనంత‌రం...మంత్రి పదవి ఇస్తామని స్వయంగా జగన్ హామీ కూడా ఇచ్చారు.. కానీ సామాజిక సమీకరణాలతో దక్కలేదు. ఇదిలాఉండ‌గా, ఈ విజ‌యంతోనే కాకుండా త‌న వ్య‌క్తిత్వం కూడా ఆర్కే వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన‌ప్ప‌టికీ..ఇప్పటికీ ఓ సాధారణ రైతు బిడ్డగా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గ బాధ్యతల్ని చూసుకుంటూనే.. తన పొలంలో వ్యవసాయానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. పొలాలను దున్నేందుకు ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చేశాయి.. కానీ రామకృష్ణారెడ్డి మాత్రం ఇప్పటికీ ఎద్దులతో దుక్కి దున్నుతున్నారు. కూరగాయలతో పాటూ సీజన్‌ను బట్టి పంటల్ని సాగు చేస్తున్నారు. ఎడ్లబండి సాయంతో తన పొలానికి వెళుతూ.. వ్యవసాయానికి కావాల్సిన అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: