ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్తితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదేమో. అసలే ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీకి ఆ తర్వాత అనేక ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు నేతలు పార్టీ జంప్ కొట్టేయడం... మరోవైపు ఓడిన నేతలు సైలెంట్ అయిపోవడం... వెరసి టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అధినేత చంద్రబాబు పార్టీ బలోపేతం చేయడానికి జిల్లాలు వెంట తిరుగుతున్నారు. ఎక్కడికక్కడే సమీక్షా సమావేశాలు పెడుతూ నేతలను యాక్టివ్ చేసే పనిలో ఉంటున్నారు.


ఇప్పటికే కొన్ని జిల్లాలో పర్యటించిన బాబు...మరికొన్ని జిల్లాలు పర్యటించాల్సి ఉంది. అయితే బాబు వెళ్ళిన జిల్లాలు, వెళ్లని జిల్లాల్లో నేతలు ఒకే తీరులో ఉన్నారు. ఏదో అక్కడక్కడ నేతలు తప్ప మిగతా వారు పార్టీ పరంగా పెద్దగా పని చేయడం లేదు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అసలు ఉందా? అనే అనుమానం కలుగుతోంది. అరకు ముందు నుంచి కాంగ్రెస్ అండగా నిలుస్తూ వస్తోంది. జగన్ వచ్చాక ఆ ప్రాంతం వైసీపీ అడ్డాగా మారింది.


పార్టీ అధికారంలో ఉన్న..లేకపోయినా ఇక్కడి గిరిజన ప్రజలు మాత్రం జగన్ని ఆదరిస్తూనే ఉన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో విశాఖ జిల్లాకు చెందిన పాడేరు, అరకు...తూర్పుగోదావరికి చెందిన రంపచోడవరం...విజయనగరంకు చెందిన పార్వతిపురం, కురుపాం, సాలూరు, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాలు. ఇక్కడ గిరిజనులదే పైచేయి. వీరు అంతా వైసీపీ వైపే ఎక్కువ ఉంటారు. అందుకే 2014 ఎన్నికల్లో అరకు ఎంపీతో సహ ఆరు స్థానాల్లో వైసీపీనే గెలిచింది. ఒక పార్వతిపురంలోనే టీడీపీ గెలిచింది.


ఇక మొన్న ఏప్రిల్ ఎన్నికల్లో మొత్తం వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. అరకు అసెంబ్లీలో టీడీపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. దీని బట్టి చూసుకుంటే ఇక్కడ వైసీపీకి ఎంతబలం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే రాజ‌కీయంగా త‌ల పండిన యోధుడు అయిన మాజీ కేంద్ర మంత్రి వైరిచ‌ర్ల కిషోర్ చంద్ర‌దేవ్‌పై వైసీపీ నుంచి పోటీ చేసిన అనామ‌కురాలు గొడ్డేటి మాధ‌వి ఏకంగా 2 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది. మరి ఇంత బలం ఉన్నచోట టీడీపీ  ఎంతో కష్టపడాలి. కానీ ఇక్కడ టీడీపీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారు. పార్టీని ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో కూడా ఇక్కడ టీడీపీ ఒక్క సీటు కూడా గెలిచే ప‌రిస్థితి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: