ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 36వ రోజుకు చేరుకుంది. కేసియార్ వైఖరికి నిరసనగా ఆర్టీసీ సిబ్బది ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం జరగబోయే ’ఛలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం నేపధ్యంలో మొత్తం తెలంగాణాలోనే టెన్షన్ వాతావరణం మొదలైపోయింది. తమ నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ యూనియన్ సంఘాలు కోరిన అనుమతిని పోలీసులు తిరస్కరించారు. పోలీసులు తిరస్కరిస్తారన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు.

 

తాము అనుమతి అడిగినట్లు, పోలీసులు తిరస్కరించినట్లు ఉండాలనే యూనియన్ నేతలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని అమలు చేసి తీరాలన్న యూనియన్ నేతల పట్టుదలకు ఉద్యోగ, టిఎన్జీవో నేతలు, విద్యార్ధి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లే కనబడుతోంది.

 

ఒక విధంగా చెప్పాలంటే కేసియార్ వైఖరిని వ్యతిరేకిస్తున్న వివిధ వర్గాలను ఆర్టీసీ జేఏసి నేతలు కలుపుకుని ముందుకెళుతున్నారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి కేసియార్ వ్యతిరేకులు రెడీ అవటం చూస్తుంటే ప్రత్యేక తెలంగాణా సందర్భంలో జరిగిన ఆందోళనలు గుర్తుకొస్తున్నాయి.  అప్పట్లో కేసియార్ ను బలోపేతం చేయటం కోసం కోదండరామ్ లాంటి వాళ్ళు బాగా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఇపుడు అదే కోదండరామ్ లాంటి వాళ్ళు కేసియార్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

అదే సమయంలో ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని ఎలాగైనా ఫెయిల్ అయ్యేలా చూడాలని సిఎం గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లే ఆర్టీసీ సిబ్బందిని కానీ వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్న వారిని ట్యాంక్ బండ్ పరిసరాల దగ్గరకు కూడా రానీయకుండా చూడమని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

 

ఒకవైపు ఆందోళన కార్యక్రమాలను ఫెయిల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అదే సమయంలో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆందోళనకారులు గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకనే తెలంగాణా మొత్తం మీద టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: