పెద్దనోట్ల రద్దుకు ముడేళ్లు. మరీ నల్లధనం వెలికితీసుకువస్తామన్న మోడీ శపథం నెరవేరిందా..? నకిలీ కరెన్సీని అడ్డుకోవాలన్న లక్ష్యం ఎంతవరకు వచ్చింది ?  ఇంతకు పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు సంభవించాయా..? 


అది 2016, నవంబర్‌ 8. అర్థరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ సడెన్‌గా పెద్దనోట్లు రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు.. నకిలీ కరెన్సీని అరికట్టెందుకు మోడీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రజలందరూ డబ్బుల కోసం ఎటీఎమ్‌లు, బ్యాంకులు చుట్టూ తిరిగారు. దీంతో ప్రతిపక్షాలు మోడీ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. కానీ బీజేపీ మాత్రం ప్రస్తుతానికి కష్టంగానే ఉన్న భవిష్యత్తులో పెద్దనోట్ల రద్దు ఫలాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. 


కాలచక్రం గిర్రున తిరిగింది. పాత పెద్ద నోట్లు రద్దు చేసి సరిగ్గా మూడేళ్లు. నోట్ల రద్దు సమయంలో మోడీ నిర్ణయాన్ని ఆర్థిక వ్యవస్థ గురించి ఏమాత్రం అవగాహన లేని సామాన్యుడి నుంచి.. ఆర్థిక నిపుణుల వరకు అంతా సమర్థించినా.. ఆ తర్వాత వెంటాడిన సమస్యలు..ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నోట్ల రద్దు ప్రకటించిన నెలరోజుల తర్వాత డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు పుంజుకున్నప్పటికీ.. నగదు వాడకం మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. మోడీ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే వ్యవస్థలోని పెద్దనోట్లన్నీ బ్యాంకులకు క్యూకట్టినా.. ప్రత్యామ్నాయ మార్గాలను వెనువెంటనే చేపట్టకపోవడం వల్ల సామాన్యులకు చుక్కలు కనిపించాయి. నెలల తరబడి ఎక్కడ ఏటీఎంలో డబ్బులున్నాయన్న వెతుకులాటలో తమ సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప.. ప్రభుత్వ చర్యతో ఒరింగిందేమీ లేదన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వ్యక్తమైంది. 


పెద్ద నోట్ల రద్దు పూర్తిగా విఫలచర్య అని నాటినుంచి విమర్శిస్తోంది కాంగ్రెస్. నోట్ల రద్దును 'తీవ్రవాద దాడి'తో పోల్చారు రాహుల్‌ గాంధీ. 'నోట్లరద్దు అనే తీవ్రవాద దాడి జరిగి మూడేళ్లు గడిచింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఎంతో మంది ప్రాణాల్ని బలిగొంది. ఈ దాడికి కారణమైన వారిని చట్టం ముందుకు తీసుకురావాల్సిందే'' అంటూ రాహుల్‌ పరోక్షంగా బీజేపీపై ధ్వజమెత్తారు. అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సైతం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దును ఆమె ఒక 'వృథా చర్య'గా అభివర్ణించారు. ఒక్క ప్రకటనతో అనేక మంది భవిష్యత్తు, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యాయన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: