ఉద్యోగం పురుష ల‌క్ష‌ణం అనే ప‌రిస్థితి ఎప్పుడో మారిపోయింది. ఫ‌లానా ఉద్యోగ‌మే చేయాలి...మ‌హిళ‌ల‌కు ఇది స‌రికాదు...అనే భావన కూడా...ఏనాడో చెరిగిపోయింది. మ‌హిళ‌లు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు. ఇక జ్ఞానంతో కూడుకున్న సాఫ్ట్‌వేర్ రంగంలో అయితే స‌త్తా చాటుకుంటున్నారు. అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తు... అన్ని రంగాల్లో ఉన్న‌ట్లే....సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా..మ‌హిళ‌ల‌పై వేధింపులు పెరిగిపోతున్నాయి. వీటిపై సంస్థాగ‌తంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు కొన్ని ప్ర‌ముఖ, అంత‌ర్జాతీయ సంస్థ‌లు అంత‌ర్జాతీయంగా క‌మిటీల‌ను ఏర్పాటు చేశాయి. అయితే, మెజార్టీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి ఏర్పాటు లేదు. అదే స‌మ‌యంలో...ప్ర‌భుత్వం ప‌రంగా ఇలాంటి వేదిక ఉంటే క‌లిగే ధైర్య‌మే వేరు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో...తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఐటీ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఉద్యోగం చేసే ప్రదేశంలో మహిళలకు ఎదురయ్యే లైగింక వేధింపులను అరికట్టేందుకు ఐటీ శాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఐటీ శాఖ ఓఎస్డీ లంక రమాదేవి అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ టీ.పద్మ సుందరి, అసిస్టెంట్‌ సెక్రటరీ ఆర్‌.శోభన్‌బాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.నాగేంద్రబాబులను సభ్యులుగా నియమించారు.


ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం హైద‌రాబాద్ వేదిక‌గా ప‌నిచేస్తున్న మ‌హిళా ఐటీ ఉద్యోగుల‌కు పెద్ద భ‌రోసా అని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం మ‌హిళా టెకీలు హైద‌రాబాద్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా ల‌క్ష‌న్న‌ర‌కు పైగా మ‌హిళ‌లు ఐటీ రంగంలో ప్ర‌త్య‌క్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ప‌రోక్షంగా ఇంకో ల‌క్ష‌మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇంత‌టి కీల‌క రంగంలో వేధింపులు అరిక‌ట్టే క‌మిటీ నియామ‌కం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్త‌మవుతోంది. ఇది తోక‌జాడించే...త‌ప్పుడు ప‌నులు చేసే వారికి చెంప‌పెట్టు వంటి చ‌ర్య అని ప‌లువురు పేర్కొంటున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: