చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌కు బ్రేకులు ఫైయిల్ కావడంతో పలు వాహనాలపై బోల్తా పడి 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ మృత్యువాహనంలా మారింది. బంగారుపాళ్యం మండలం చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ వద్ద బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి డివైడర్‌ ఢీకొని పక్కనే వెళ్తున్న వాహనాలపై పడిపోయింది.

ఆటో, ఓ ఓమ్నీ వ్యాన్, ఒక మోటార్ సైకిల్ దానికింద పడి నుజ్జయ్యాయి. ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కంటైనర్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఓ వైపు కంటైనర్‌కు బ్రేకులు ఫెయిల్ అవ్వడం, మరోవైపు అతి వేగం కారణంగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో స్కూటర్ దగ్ధమైంది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


క్షతగాత్రులను108 వాహనంలో సమీపంలోని పలమనేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మృతదేహాలను గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు.  ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గంగవరం మండలం మరిమాకుల గ్రామానికి చెందిన వారు మినీ వ్యాన్‌లో చిత్తూరు నుంచి గంగవరం వెళ్తుండగా దానిపై కంటైనర్ బోల్తా పడింది.

మరణించిన వారి పేర్లు… రామచంద్ర (50), రాము (38), సావిత్రమ్మ (40), ప్రమీల (37), గురమ్మ (52), సుబ్రమణ్యం (49), శేఖర్ (45), పాపమ్మ (49). ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మరణించడంతో ఆ ఊరంతా విషాదంలో మునిగిపోయింది. అలాగే కంటైనర్ కిందపడిన ద్విచక్ర వాహన దారుడు నరేంద్ర (37) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అతడిది పలమనేరు మండలం బలిజపల్లి గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: