ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. సీతారాం పై టీడీపీ నేతలు తమ అస్త్రాలు ఎక్కుపెట్టారు. సభాపతి స్థానంలో ఉండి ప్రతిపక్షనేతకు  ఎలాంటి గౌరవం ఇవ్వాలో  కూడా తెలియని స్థితిలో స్పీకర్ ఉన్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టిడిపి నేతలు. భేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని చంద్రబాబుకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హయ్ లాండ్ భూములను కొట్టేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు... పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుట్రలు చేశారంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. కాగా  దీనిపై టిడిపి నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఇక తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం కు బహిరంగ లేఖ రాశారు. 



 బడుగు బలహీన వర్గాలకు చెందిన తమరు మీ అనుభవం తో స్పీకర్ పదవికి వన్నె తెస్తారని అందరు అనుకున్నారని... విలువలతో సభ నిర్వహించి  ట్రెండ్ సెట్ చేస్తాను అన్న మీరు... అసభ్య పదజాలంతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారంటూ లోకేష్ విమర్శించారు. సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పై మీరు చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవే అని  అనుమానం కూడా కలుగుతుందని లోకేష్ ఆరోపించారు. అయితే ఒక ప్రతిపక్ష నేత పై అసభ్య పదజాలంతో దూషించిన మీరు ఇదే సభలో ఐదేళ్లపాటు సభ్యునిగా ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలని లోకేష్ తెలిపారు. పలుమార్లు ముఖ్యమంత్రిగా ఎన్నో సార్లు ప్రతిపక్ష నేతగా శాసనసభ సభ్యుడిగా ఉన్న నారా చంద్రబాబు ను  ఒక  సభాపతి అయ్యుండి కూడా గుడ్డలూడదీస్తాను  అంటూ మాట్లాడడం మీ స్పీకర్ పదవిని చిన్నబుచ్చేలా ఉంది అంటూ లోకేష్ విమర్శించారు. 



 ఇదిలా ఉండగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పీకర్ తమ్మినేని సీతారాం పై పలు విమర్శలు గుప్పించారు. ఒక స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు . స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది అని  ఆయన విమర్శించారు. అంతేకాకుండా సీఎస్ ను  ఎందుకు బదిలీ చేశారో  జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కు కారణం కూడా వైసిపి ప్రభుత్వమేనని... ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఇసుకను కొనుగోలు  విధానం ప్రవేశపెట్టగా ఆన్లైన్లో ఇసుకను  ఖాళీ చేస్తుంది  వైసీపీ నేతలే అని  ఆరోపించారు కళా వెంకట్రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: