అధికార పీఠం అధిష్టించిన నాటి నుంచి సంచలనాలపై సంచలనాలు క్రియేట్ చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు. తెలుగు మీడియం ను తీసేస్తున్నారు. అంటే ఇక తెలుగు భాష సబ్జక్టు తప్ప అంతా ఇంగ్లీష్ లోనే బోధన ఉంటుందన్నమాట.


ఈ నిర్ణయంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేది ఈ వర్గాల ప్రజలే. ఇకపై అన్ని తరగతుల్లోనూ తెలుగు ఒక సబ్జక్టుగా తప్పనిసరిగా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు కొన్ని పత్రికలు తప్పుబడుతున్నాయి. ప్రత్యేకించి తెలుగులో అగ్రశ్రేణి పత్రిక రోజూ వరుస కథనాలు ప్రచురిస్తోంది. తెలుగుకు అన్యాయం జరిగిందని రాస్తోంది.


అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో రాణించాలని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని గొప్ప లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుకు నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.17 కోట్ల ఇచ్చి నారాయణ పుస్తకాలు మున్సిపల్‌ పాఠశాలలకు అందించింది. ఇంగ్లిష్‌ మీడియంపై అనవసరపు విమర్శలు చేస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు, పత్రిక అధినేత వారి మనవళ్లను తెలుగు మీడియంలో చదివిస్తున్నారా..? ఐఏఎస్‌ ఆఫీసర్ల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నప్పుడు వారి ఇంట్లో పనిచేసే వారి పిల్లల కోసం ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయడం తప్పా..? అంటూ ఆయన నిలదీశారు.


ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 2020–2021 విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం చేస్తామని, ఆ తరువాత ఏడాది 9వ తరగతి, మరుసటి ఏడాది పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం చేస్తామని సురేష్ వివరించారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు పెద్ద పెద్ద చదువులకు వెళ్లినప్పుడు ఇబ్బందులు పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశమని ఆయన వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: