మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పురా టైగర్ రిజర్వ్ లో ఉన్న ఒక చెట్టుకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ చెట్టును తాకితే రోగాలు నయమవుతాయని ప్రచారం జరగటంతో రోగాలను నయం చేసుకోవడానికి చాలామంది అడవిబాట పట్టారు. ప్రతిరోజు 20,000 మందికి పైగా ఈ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. అద్భుతంగా శక్తులున్నాయని ప్రచారం జరుగుతున్న ఈ చెట్టు పేరు 'మహువా '. 
 
ఈ చెట్టుకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని ప్రచారం జరగటానికి కారణం రూప్ సింగ్ ఠాకూర్ అనే రైతు. కుంటుతూ నడిచే రూప్ సింగ్ ఒక రోజు అనుకోకుండా మహువా చెట్టును పదినిమిషాలు తాకడంతో ఆరోగ్యం మెరుగైందని సాధారణ స్థితికి చేరుకున్నానని కుంటకుండా మామూలుగానే నడుస్తున్నానని మీడియాకు చెప్పాడు. రూప్ సింగ్ మీడియాతో మాట్లాడిన తరువాత ఆ వీడియోలు వైరల్ కావటంతో  మహువా చెట్టుకు రోగుల తాకిడి పెరిగింది. 
 
ఈ విషయం తెలిసిన ఒక వ్యక్తి ఆరోగ్య సమస్య తగ్గాలని మహువా చెట్టు దగ్గరకు వెళ్లాడు. ఆ చెట్టును తాకిన తరువాత తన రోగం తగ్గిపోయిందని తనతో వచ్చిన వాళ్లకు చెప్పాడు. కానీ కొంత సమయం తరువాత ఆ వ్యక్తి చనిపోయాడు. కొందరు వీల్ చైర్లలో కూడా ఈ చెట్టు దగ్గరకు రావడం గమనార్హం. వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉండటంతో కొందరు ఈ చెట్టుకు సమీపంలో కొబ్బరి బోండాలు విక్రయిస్తూ, హోటల్స్ నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 
 
కొంతమంది మహువా చెట్టు ఫోటోలను అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు. మహువా చెట్టు ఫోటోలను తాకినా రోగాలు తగ్గిపోతాయని ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకోవటం గమనార్హం. అధికారులు మాత్రం డబ్బు తేలికగా సంపాదించాలనే ఉద్దేశంతో చెట్టు గురించి ప్రచారం చేశారని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం భారీ సంఖ్యలో జనాలు రావడం వలన చెత్తాచెదారం పేరుకుపోతుందని వన్య ప్రాణులకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: