జగన్మోహన్ రెడ్డి గనుక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఇనుప ఖనిజాన్ని తెప్పించగలిగితే కడప జిల్లా దశ మారిపోతుందనటంలో సందేహం లేదు. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్ని ఓ నిర్ణయం. అయితే  ఈ విషయంలో చంద్రబాబునాయుడు బాగా తాత్సారం చేశారు. చివరకు ఏదో తూతూ మంత్రంగా డ్రామాలాడి ఉక్కు పరిశ్రమకు దీక్షలని, శంకుస్ధాపనలని నాటకాలాడారు. సరే చంద్రబాబు డ్రామాలకు అప్పట్లో ఎంపి జేసి దివాకర్ రెడ్డే గాలి తీసేశారనుకోండి అది వేరే సంగతి.

 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప స్టీల్ పరిశ్రమ ఏర్పాటుపై గట్టిగా దృష్టి పెట్టారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయటమన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కల. నిజంగా ఈ జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయగలిగితే  ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతుందనటంలో సందేహం లేదు.

 

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తో సిఎం భేటి అయ్యారు. ఎన్ఎండిసి నుండి కడపలో ఏర్పాటవ్వబోయే పరిశ్రమకు ముడి ఖనిజాన్ని అందించటానికి అవసరమైన ఒప్పందాలు చేసుకోమని కేంద్రమంత్రి ఆదేశించారు. వీరి భేటిలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, ముడిచమురు రిఫైనరీ, కాకినాడ-రాజమండ్రి మధ్య పెట్రోలియం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు కేంద్రమంత్రి.

 

నిజానికి విభజన చట్టం ప్రకారం ఏపి అభివృద్దికి రావాల్సినంత సాయం కేంద్రం నుండి రాలేదన్నది వాస్తవం. ఇందులో చంద్రబాబు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.  కేవలం చంద్రబాబు చేతకానితనం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం ఐదేళ్ళు వెనకబడిందనే చెప్పాలి. ఇటువంటి పరిస్ధితుల్లో జగన్ కేంద్రమంత్రితో భేటి అవటం, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూల ఫలితాలు సాధించటం మంచి పరిణామమే.

 

ప్రభుత్వ అధికారుల నివేదిక ప్రకారం కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేలు, కడప, కమలాపురం లాంటి నియోజకవర్గాల్లో ఎక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసినా బాగానే ఉంటుంది. పరిశ్రమ ఏర్పాటు విషయంలో జగన్ గనుక పట్టుబట్టి సాధించగలిగితే జిల్లా స్వరూపమే మారిపోతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: