ఒకపుడు హిరణ్యకశిపుడు తమ్ముడు హిరణ్యాక్షుడు అనే దానవుడు ఉండేవాడు, ఆయన ఏకంగా భూమిని చేపచుట్టినట్లుగా చుట్టేసాడని పురాణ కధలు చెబుతున్నాయి. ఇపుడు కలియుగం కదా ఆయన తమ్ముళ్ళు గజానికొకడు పుట్టేశాడు. భూములను చేప చుట్టేయడమే కాదు ఏకంగా పళ్ళెంలో పెట్టుకుని భోంచేసేశారు. విభజన ఏపీలో అతి పెద్ద  నగరంగా ఉన్న విశాఖలో భూ దందా ఈ రేంజిలో జరిగిందంటే షాకే మరి.


అభివ్రుధ్ధి ఎక్కడుంటే అక్కడ భూ కబ్జాలు కూడా చోటు చేసుకోవడం నవీన యుగం దాదాయిజం. విశాఖ ప్రగతి బాగా ముందుకు వెళ్తున్న వేళ  ఇక్కడ భూములకు కూడా రెక్కలు వచ్చేశాయి. ఎంవీపీ కాలనీ లాంటి చోట గజం లక్ష రూపాయలు పై మాటగా ఉందంటే ఇక వందల వేల కోట్లు భూదందా గురించి వేరే చెప్పనవసరం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న భూ దందాలపై నాడు సిట్ ని చంద్రబాబు ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. అయితే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిన ఆ సిట్ నివేదిక మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.


ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ తాజాగా రెండవ సిట్ ని ఏర్పాటు చేసింది. గత వారం రోజులుగా సిట్ విశాఖలో విచారణ జరిపితే కళ్ళు  బైర్లు కమ్మే విషయాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ భూముల రీకార్డులను సైతం టాంపరింగ్ చేయడం భూ దందాలో రికార్డ్ అనుకోవాలి. ఇక ప్రైవేట్ భూమూలకు లెక్కే లేదు. ఆటవిక సామ్రాజ్యం మాదిరిగా సెంట్ జాగా కనబడితే చాలు కలబడిపోయి భూ బకాసరులు దోచేశారు.


ఇలా 20 వేల ఎకరాల పై మాటగానే ఈ భూ దందా సాగిందని సిట్ ముందుకు వచ్చిన ఫిర్యాదులు చెబుతున్నాయి. కేవలం వారం వ్యవధిలో రెండు వేల పైగా ఫిర్యాదుదారులు తమ గోడు చెప్పుకున్నరంటే ఎంత పెద్ద ల్యాండ్ స్కాం జరిగిందో అర్ధం చేసుకోవాలి. మొత్తానికి సిట్ విచారణ కాదు కానీ విశాఖ భూ దాహం  ఏ రేంజిలో ఉందో బయటపడింది. ఇపుడు విచారణ జరిపించి  కబ్జాదారుల జాతకాలు తేల్చాలని ఫిర్యాదుదారులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: