ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్న పేరు మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు. జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ఉన్న క‌న్న‌బాబు.. ఆ ప‌ద‌విలోకి వ‌చ్చి ఐదు మాసాలైనా పెద్ద‌గా ఎవ‌రి దృష్టిలోనూ ప‌డేలేదు. ఏదో ఒక‌టి రెండు సార్లు మాత్ర‌మే మీడియా స‌మావేశాలు ప‌ట్టి.. త‌న శాఖ ప‌రిధిలోని విష‌యాల‌ను వివ‌రించ‌డానికే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో మాట్లాడే వారు ఒక‌రిద్ద‌రే త‌ప్ప ఇంకెవ‌రూ లేరు! అనే నిర్దార‌ణ‌కు దాదాపు అంద‌రూ వ‌చ్చేశారు. అయితే, ఇంత‌లోనే క‌న్న‌బాబు పుంజుకున్నారు. గ‌డిచిన రెండు వారాలుగా ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌దునైన మాట‌ల‌తో ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రి అటెన్ష‌న్ ఇప్పుడు క‌న్న‌బాబువైపు మ‌ళ్లింది.


2007లో ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన క‌న్న‌బాబు.. చిరంజీవి ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ప‌డ్డారు. చిరంజీవి సామాజిక వ‌ర్గానికే చెందిన నాయ‌కుడు కావ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఆయ‌న రాజ‌కీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక‌, ఆ పార్టీని విలీనం చేయ‌డంతో మారిన రాజకీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వైసీపీ జెండా వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. కాపు సామాజిక వ‌ర్గంలో ప‌ట్టున్న నాయ‌కుడు, నిగ‌ర్వి, విద్యావంతుడు, జ‌గ‌న్ అంటే ఎంతో అభిమానం చూపించే క‌న్న‌బాబుకు జ‌గ‌న్ ఆదిలోనే మంత్రి ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించారు.


అది కూడా వ్య‌వ‌సాయ శాఖ కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, స‌హ‌జంగా ఎలాంటివివాదాల‌కూ పోకుండా ఉండే క‌న్న‌బాబు.. పెద్ద‌గా మీడియా ముందుకు రాలేదు. ఎవ‌రినీ ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. అయితే, ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌లో నిర్వ‌హించిన లాంగ్ మార్చ్ సంద‌ర్భంగా క‌న్న‌బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌నవిమ‌ర్శ‌లు చేశారు. రాజ‌కీయాలు వేరు సినిమాలు వేరు అంటూ ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. తాను రాజ‌కీయాల్లో ఎక్క‌డ ఉన్నా..త‌న‌కు రాజ‌కీయంగా వెలుగు ప్ర‌సాదించిన చిరంజీవిని త‌లుచుకున్నాన‌ని, కానీ, త‌న‌తోపాటు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ ఎన్న‌డైనా.. ఎక్క‌డైనా చిరంజీవిని త‌లుచుకున్నారా? అంటూ మాట‌ల యుద్ధం చేశారు. దీంతో క‌న్న‌బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓ రేంజ్‌లో చ‌ర్చ సాగింది.


క‌న్న‌బాబు అక్క‌డితో ఆగిపోలేదు. మాజీ సీఎం చంద్ర‌బాబుపై కూడా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారుపై చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను, నిర‌స‌న‌ల‌ను అంతే రేంజ్‌లో క‌న్నబాబు తిప్పికొట్టారు.  చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, 4 నెలలకే తట్టుకోకపోతే ఎలా?.. ఇంకా నాలుగున్నరేళ్ల పాలన ఉందన్నారు.  ప్రజల తీర్పుతో ఖాళీగా ఉండి వీడియో గేమ్స్ ఆడుతున్నది చంద్రబాబు, లోకేష్‌లేనని కన్నబాబు విమర్శించారు. మొత్తంగా క‌న్న‌బాబు తీరును గ‌మ‌నిస్తున్న ప‌రిశీల‌కులు.. ఆయన ఇదే రేంజ్‌ను కొన‌సాగిస్తే.. జ‌గ‌న్ కేబినెట్‌లోని ఒక‌రిద్ద‌రు మాట‌కారి మంత్రుల స‌ర‌స‌న చేర‌డం, ప్ర‌జ‌ల్లోనూ తిరుగులేని గుర్తింపు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: