వివాదాస్పద రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు ఈరోజు అంతిమ తీర్పు ఇచ్చింది. ఈరోజు వెల్లడైన తీర్పుపై దేశ ప్రధాని మోదీ స్పందించారు. ‘అయోధ్యపై తీర్పు ఎవరికీ గెలుపు కాదు.. ఎవరికీ ఓటమి కాదు. రామభక్తి, రహీం భక్తి కాదు.. దేశభక్తి భావాన్ని అందరం కలిసి బలోపేతం చేయాలి. దేశ ప్రజలంతా శాంతి, ఐకమత్యంతో ఉండాలి. ప్రజలందరూ సహనం, సంయమనగం, ఐకమత్యంతో మెలగాలి. శాంతి, ఐకమత్యం, సద్భావన అనేవి భారత్ సంప్రదాయమని గుర్తించాలి’ అని పిలుపునిచ్చారు.

 

 

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. 'అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు ఒక మైలురాయి. ప్రజలంతా శాంతి, సంమయమనంతో ఉండాలి. ఎటువంటి వివక్షకూ తావులేకుండా మెలగాలి' అన్నారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 'సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రజలు  సంయమనం పాటించాలి. శాంతి స్థాపనే మన ధ్యేయంగా ఉండాలి. ప్రజలందరూ సంతోషంగా మెలగాలి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అందరం గౌరవిద్దాం' అంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్‍సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు తీర్పు సంతులితమైనది. ఈ నిర్ణయాన్ని స్వచ్ఛమైన మనసుతో అంగీకరించాలని కోరుతున్నాను. శాంత భావంతో, ఒక తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా అన్ని పక్షాల వారికి ఉండాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.

 

 

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అయోధ్యపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. రామమందిరం నిర్మాణానికి అందరం చేయిచేయి కలిపి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్‌కు భూమి అప్పగించడం, ఆలయ నిర్మాణం అన్నీ  జరుగుతాయి. ఇలాగే జరగాలని మేము నిర్దేశించడం లేదు. వివాదం సమసిపోయిందని భావిస్తున్నాం. మసీదు నిర్మాణానికి  5 ఎకరాల స్థలం ఎక్కడ ఇవ్వాలి, ఎలా అనేది సుప్రీం ఆదేశాల ప్రకారం కేంద్రం చూసుకుంటుంది. మందిరం నిర్మాణమే మా లక్ష్యం’ అన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: