మానవసంబంధాలు, విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. గుంటూరులో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. 55 సంవత్సరాల వయస్సు ఉన్న డేగల సుబ్బమ్మ గుంటూరు జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో కుటుంబంతో కలిసి నివశిస్తోంది. తన చెల్లెలి కుమారుడు రాజశేఖర్ రెడ్డి కొన్ని నెలల క్రితం డబ్బు అవసరం ఉందని సహాయం చేయమని డేగల సుబ్బమ్మను కోరాడు. 
 
డేగల సుబ్బమ్మ 16 సవర్ల బంగారాన్ని రాజశేఖర్ రెడ్డికి ఇవ్వగా రాజశేఖర్ రెడ్డి ఆ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాడు. కొన్ని రోజుల క్రితం రాజశేఖర్ రెడ్డి ఆ డబ్బు చెల్లించి నగలను విడిపించాడు. కానీ విడిపించిన నగలను డేగల సుబ్బమ్మకు ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి నగలను విడిపించాడనే విషయం సన్నిహితుల ద్వారా తెలిసిన సుబ్బమ్మ ట్రాక్టర్ పై వెళుతున్న రాజశేఖర్ రెడ్డిని నగలు ఇవ్వమని కోరగా రాజశేఖర్ రెడ్డి తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పాడు. 
 
కొంత సమయం తరువాత సుబ్బమ్మ నగలు ఇచ్చేవరకు ఇంటికి తిరిగి వెళ్లనని చెప్పింది. ఆ తరువాత ట్రాక్టర్ ముందుకు పోకుండా సుబ్బమ్మ అడ్డంగా కూర్చుంది. సుబ్బమ్మ అక్కడినుండి వెళ్లకపొవటంతో రాజశేఖర్ రెడ్డి సుబ్బమ్మ మీద నుండి ట్రాక్టర్ నడిపాడు. ట్రాక్టర్ మీద నుండి పోవటంతో సుబ్బమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావమైన సుబ్బమ్మ అక్కడికక్కడే మరణించింది. స్థానికులు రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని చితకబాదారు. 
 
స్థానికులు నిందితుడు రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. క్షణికావేశంతో చేశానని నిందితుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులకు చెప్పాడని సమాచారం. సొంత పెద్దమ్మనే రాజశేఖర్ రెడ్డి చంపటంతో ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. తాకట్టు కోసం ఇచ్చిన బంగారు నగలను అడిగినందుకు ఏ తప్పు చేయని సుబ్బమ్మ ప్రాణాలు పోయాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: