ప్ర‌కాశం జిల్లాలోని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు అధికార పార్టీ వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిపో యింది. ఇక్క‌డ పావులు క‌దిపేందుకు, పునాదులు బ‌లంగా వేసుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్ర‌య త్నాలు గ‌డిచిన రెండు ఎన్నిక‌లుగా విఫ‌ల‌మ‌వుతూనే ఉన్నాయి. అయినా కూడా ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్క‌డ వైసీపీ జెండా ఎగ‌రాలనే ల‌క్ష్యంతో పార్టీ నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడిగా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావు బ‌లంగా ఉండ‌డ‌మే.


2014లో ఇక్క‌డ గెలిచిన ఏలూరి.. త‌న‌కంటూ.. బ‌ల‌మైన పునాదులు వేసుకున్నారు. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ఓటు బ్యాంకును వ్య‌క్తిగ‌తంగా సంపాయించుకున్నారు. ఇది ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాగా క‌లిసి వ‌చ్చింది. అస‌లు ఓట‌మి అనేది తెలియ‌ని, ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావును ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించారు ఏలూరి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ.. వైసీపీ ప్ర‌భావం.. పాద‌యాత్ర ఎఫెక్ట్ ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ మాత్రం ద‌గ్గుబాటి ఓట‌మి పాల‌య్యారు. దీంతో వైసీపీ పెట్టుకున్న టార్గెట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి చేజారి పోయిన‌ట్ట‌యింది.


దీంతో ఇక్క‌డి ప‌రిస్తితుల‌ను వైసీపీ నాయ‌కులు అధ్య‌యనం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు తెలిశాయి. అస‌లు ఏలూరి ఇంత బ‌లంగా ఇక్క‌డ పునాదులు వేసుకోవ‌డానికి కార‌ణాలు వారికి స్ఫ‌స్టంగా క‌నిపించాయ‌ట‌. నీళ్ల ప‌రంగా టెయిలెండ్‌ ప్రాంతంగా ఉన్న ప‌రుచూరుకు ప‌ట్టిసీమ నుంచి వాట‌ర్‌ను తీసుకు వెళ్లేందుకు ఏలూరి  కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. నాడు సీఎంగా ఉన్న బాబుపై ఒత్తిడి చేసి మ‌రీ 15 రోజుల పాటు అద‌నంగా ప‌ట్టిసీమ నుంచి నీటిని అక్క‌డ‌కు తీసుకువెళ్లారు. గ‌తంలో కొన్ని ద‌శాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ద‌గ్గుబాటి స‌హా ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన నాయ‌కులు ఎవ‌రూ ఇక్క‌డ చెరువులు, కాలువ‌ల‌ను ప‌ట్టించుకోలేదు.


ఎక‌రాకు ప‌ట్టుమ‌ని ప‌ది బ‌స్తాలు పండిన దాఖ‌లా లేదు. అలాంటి చోట ఏలూరి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని తాగు, సాగు నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ఓ ఏడాది ఇక్క‌డ రైతులు  తమ పంట‌ల్లో పండిన వ‌రితో పొంగ‌ళ్లు చేసుకుని తీసుకు వెళ్లి చంద్ర‌బాబుకు బ‌హుమానంగా ఇచ్చారు. ఆ ఒక్క‌టే కాకుండా గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం, ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండ‌డం అనే కీల‌క ల‌క్ష‌ణాలు కూడా ఏలూరికి క‌లిసివ‌చ్చాయి.  


ఇక‌, వైసీపీ ప‌రిస్థితి చూస్తే.. ఇక్క‌డ రావి రామ‌నాథంను పెట్టాల‌ని అనుకుంటున్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో గొట్టిపాటి భ‌ర‌త్ ఓడిపోయాడు. దీంతో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి రావి రామ‌నాథంను తీసుకువ‌చ్చారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏలూరికి స‌మఉజ్జీ కాద‌నే ఉద్దేశంతో రావిని ప‌క్క‌న పెట్టి.. ద‌గ్గుబాటికి అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఆయ‌న కూడా ఓట‌మి పాల‌వ‌డంతో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసిన రామ‌నాథంను మ‌ళ్లీ తీసుకువ‌చ్చారు. ఆయ‌న వ‌ల్ల కూడా ఏలూరి కొట్ట‌డం సాధ్యం కాద‌నే ఇప్పుడు కొల్లా వెంక‌ట్రావుతో పాటు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు ఎన్నారైల పేర్లు ప‌రిశీలిస్తున్నారు. ఇలా మొత్తంగా ఏలూరిని జ‌యించేందుకు వైసీపీ నానా అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. మ‌రి భ‌విష్య‌త్తులో ఎలాంటి నాయ‌కుడు ఇక్క‌డ వైసీపీ ప‌గ్గాలు చేప‌డ‌తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: