గోదావరి జిల్లాల్లో టీడీపీ కి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో రెండు జిల్లాల్లోనూ భారీగా సీట్లు గెలిచింది టీడీపీ. అస‌లు చంద్ర‌బాబు సీఎం అయ్యేందుకు ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌లు వేసిన ఓట్లే కార‌ణం. ఆ తర్వాత జనాల్లో వ్యతిరేకతను కూడా భారీగా మూటగట్టుకుంది. ఫ్యాన్ రెక్కలు ఒంగిపోయాయి అని కామెంట్ చేస్తూ సైకిల్ టైర్లే పగిలిపోయాయి అనే విషయాన్ని మాత్రం గ్రహించలేదు. దీనితో ఈ యేడాది ఎన్నిక‌ల్లో ఉద్దండులు కూడా ఓడిపోయి ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. 


రాజకీయంగా ఒకప్పుడు తమకు అండగా నిలిచిన గోదావరి జిల్లాలు 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ కు ఏకపక్షంగా సీట్లు ఇచ్చేశాయి. ఇప్పుడు అక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏంటి...? అంటే పెదవి విరిచే సమాధానం ఆ పార్టీ నేతల నుంచే వినపడుతోంది. వర్గ విభేదాల్లో ఎక్కువగా ఈ జిల్లాల పేర్లే వినపడుతూ ఉంటాయి. ఆ విభేదాలే పార్టీని నాశనం చేశాయి అనేది కార్యకర్తల ఆవేదన. ఇప్పుడు కూడా ఆ విభేదాల్లో ఏ మార్పు రావడం లేదు. సీనియర్ నేతలు ఒక వర్గాన్ని, యువనేతలు ఒక వర్గాన్ని మోస్తూ పార్టీని పక్కన పెడుతున్నారు. 


ఇక యనమల రామకృష్ణుడు, చినరాజప్ప దెబ్బకు తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి పెద్ద రంధ్రమే పడింది. కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉండటానికి వీరిద్దరే కారణం. ఇప్ప‌టికే వ‌రుపుల రాజా, తోట త్రిమూర్తులు లాంటి వాళ్లు పార్టీ వీడి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నియోజకవర్గానికి రెండు మూడు వర్గాలు ఉన్నాయి. చివరికి చింతలపూడి నియోజకవర్గంలో పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు, కొవ్వూరులో జొన్నలగడ్డ చౌదరి, అచ్చిబాబు వర్గాలు ఉన్నాయి. గోపాల‌పురం, పోల‌వ‌రం, తాడేప‌ల్లిగూడెంలోనూ ఇదే ప‌రిస్థితి.


ఇలా నియోజకవర్గాల వారీగా వర్గాలు మైంటైన్ చేస్తూ పార్టీకి కష్టపడినా సరే కొందరికి గుర్తింపు ఇవ్వడం లేదు. ఏలూరు పార్లమెంట్ లో ప్రతీ నియోజకవర్గంలో మాగంటి బాబు వర్గాలు ఉన్నాయి. నూజివీడులో కూడా ఆయన వర్గానికి మాజీ ఎమ్మెల్యే ముద్ద‌ర‌బోయిన వ‌ర్గానికి ప‌డ‌డం లేదు. ఈ గొడ‌వ‌ల‌తో పాటు పార్టీ ఘోరంగా ఓడిన నేప‌థ్యంలో చాలా మంది ద్వితీయ శ్రేణి నేత‌లు, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు పార్టీ వీడి వెళ్లిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: