మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్ర‌క్రియ ట్విస్టుల మీద ట్విస్టులుగా కొన‌సాగుతోంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.  మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేదని తామేనని ముందు నుంచి చెప్తున్న బీజేపీ..తాజాగా కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ తెలిపారు. దీంతో స‌ర్కారును ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్వారి శివసేన పార్టీని ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ బలాన్ని, సుముఖతను తెలపాల్సిందిగా శివసేనను కోరారు. రేపు రాత్రి 7.30 గంటల లోపు తమ నిర్ణయం తెలపాల్సిందిగా పేర్కొన్నారు.


ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఫడ్నవిస్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని ఈ సందర్భంగా గవర్నర్ కు తెలియజేశారు. అనంతరం చంద్రకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ బీజేపీని ఆహ్వానించారు. కానీ శివసేన మాకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీజేపీ-శివసేన కూటమికి ప్రజలు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలాన్ని ఇచ్చారు. ఒకవేళ శివసేన కూటమిని అగౌరవపరిచి కాంగ్రెస్‌-ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే వారికి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.


మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాలు సాధించగా...మిత్రపక్షం శివసేన 56 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 145. అయితే 50-50 పద్దతిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని శివసేన కోరగా..బీజేపీ అందుకు నిరాకరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మ‌రోవైపు, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తమకు ఇష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు శివసేన నేత సంజయ్‌ రావత్‌ మాట్లాడుతూ..శివసేన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే స్పష్టంగా వెల్లడించారని అన్నారు. శివసేన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: