ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై తెలంగాణ ప్రభుత్వం క‌త్తులు నూరుతోందా? ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా...మోదీ స‌ర్కారుపై అసంతృప్తి గ‌ళం విప్ప‌నుందా? తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన విజ్ఞప్తుల విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అనుసరిస్తోందని టీఆర్ఎస్ వ‌ర్గాలు ప్ర‌చారంలో పెట్టాయి. రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి కీలకమైన ఏ అంశంలోనూ కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిన సందర్భమే లేదని, ఇది తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడమేనని పలువురు విమర్శిస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు స్వయంగా ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వద్దకు వెళ్లి వినతిపత్రాలు అందించినా పట్టించుకోకపోవడం రాజకీయ ఉద్దేశాలతోనేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, అమలుచేస్తున్న కార్యక్రమాలు, పథకాలను కేంద్రం ప్రశంసించడం తప్ప.. ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.


హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, స్కై వేలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం కేంద్ర విభాగాల ఆధీనంలోని భూములను కేటాయించాలని సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ అప్పటి, ప్రస్తుత కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌సింగ్‌ను అనేకసార్లు కలిశారు. కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లో కొత్త విమానాశ్రయాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌స్ట్రిప్‌లు ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ అనేకసార్లు కోరారు. తెలంగాణలో మెగా పవర్‌లూం క్లస్టర్ నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తికి ఇప్పటికీ స్పందన లేదు. సిరిసిల్లలో దాదాపు 36 వేల పవర్‌లూం పరిశ్రమలు, 250 డైయింగ్ యూనిట్లు, 400 పడుగుదారాల యంత్రాలు ఉన్నాయని, 20వేల మంది వీటిలో పనిచేస్తున్నారని పేర్కొంటూ ఇక్కడ పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తెలంగాణలో కొత్తగా సమగ్ర చేనేత అభివృద్ధి పథకం కింద 14 క్లస్టర్లను మంజూరుచేయాలని కోరారు. గద్వాలలో జాతీయ టెక్స్‌ టైల్ పరిశోధన కేంద్రం, జాతీయ చేనేత ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేయాలని, హైదరాబాద్‌లో చేనేత ఎగుమతి ప్రోత్సాహక మండలిని నెలకొల్పాలని విన్నవించారు. వరంగల్ రూర ల్ జిల్లా శాయంపేటలో ఏర్పాటు చేయదలిచిన మెగా టెక్స్‌ టైల్‌పార్క్‌ లో వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణానికి ఆర్థికసహాయం కోరా రు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌పార్కును ఇండియన్ లెదర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద అనుమతించాలని అప్పటి వాణిజ్య మం త్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. అయినా ఇప్పటి వరకు స్పందన లేదంటున్నారు. ఐటీఐఆర్ విషయంలో అనేకమార్లు కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. స్వయంగా ప్రధానిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. 2010 లో ప్రాజెక్టును మంజూరుచేశారని, తొలిదశలో రూ.4,863 కోట్లు, రెండోదశలో రూ.942 కోట్లు, బాహ్య మౌలిక సదుపాయాల కోసం రూ.3,921కోట్లు విడుదలచేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడానికి సహకారం అందించాలని కేంద్రమంత్రులకు విజ్ఞప్తిచేశారు. దానికీ స్పందనలేదంటున్నారు. 


ఫార్మాసిటీ, చేనేత క్లస్టర్, ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక కారిడార్లు, డిఫెన్స్ కారిడార్, ఐటీఐఆర్, ఎన్డీసీ, హైదరాబాద్ రోడ్ల విస్తరణకు ర‌క్షణ భూముల బదలాయింపు, విమానాశ్రయాలు...ఇలా అనేక అంశాలపై మంత్రి కేటీఆర్ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. వాటి ఏర్పాటు, నిధులు ఇవ్వాల్సి న ఆవశ్యకతపై వివరించారు. కానీ.. తెలంగాణ ప్రజాసమస్యలు, అవసరాలు తమకు పట్టనట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: