మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నంబర్ గేం పాలిటిక్స్ జాతకాలను రాత్రికి రాత్రి మార్చేస్తోంది. బీజేపీతో కలసి శివసేన కొటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మడతపేచీ పెట్టేసింది. తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని భీష్మించుకుని కూర్చుంది. పెద్ద పార్టీ అయినా బీజేపీని ధిక్కరించి సైతం గత పదిహేను రోజులుగా రాజకీయ  రాధ్ధాంతం చేస్తూ వచ్చింది.


ఇక శివసేన మద్దతు లేకపోవడంతో గవర్నర్ ఇచ్చిన ఆహ్వానాన్ని బీజేపీ కాదనుకుంది. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్త్రి లేనందువల్ల తాము వెనక్కితగ్గుతున్నట్లుగా పెద్ద పార్టీ అయిన బీజేపీ గవర్నర్ కి   తాజాగా తెలియచేసిన వెంటనే పరిణామాలు చకచకా మారిపోయాయి. బీజేపీ తరువాత పెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో శివసేనకు బంపర్ ఆఫర్ తగిలినట్లైంది. ఈ రోజు రాత్రి ఏడున్నర గంటల లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారీ స్పష్టం చేశారు. దీంతో శివసేన కోరిక ఎట్టకేలకు తీరబోతోంది. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయితే 54 మంది సభ్యుల బలం ఉన్న ఎన్సీపీ మద్దతుతో పాటు, మరో 44 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ మద్దతు కూడా ఉంటే సర్కార్ సులువుగా  ఏర్పాటు చేయవచ్చు. 


దాంతో మద్దతు కూడగట్టేందుకు శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ లతో చర్చలు జరుపుతోంది. ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే తాము మద్దతు ఇస్తామని ఎన్సీపీ శివసేనకు షరతు విధించింది. కేంద్రంలో మంత్రి పదవులు వదులుకోవాలని కూడా కోరింది. దానికి శివసేన ఓకే అనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే శివసేనకు మహారాష్ట్రలో బేస్ ముఖ్యం. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి రాకుండా పోయింది. పైగా శివసేనకు బాలధాకరే తరువాత గట్టి నాయకత్వం ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇక  మూడవ తరంగా మనవడు ఆదిత్య థాకరేను సీఎం చేయాలని గట్టిగా భావిస్తోంది. ఈ నేపధ్యంలో కొన్నాళ్ళు అయినా ఆదిత్యా ధాకరేను ముఖ్యమంత్రిగా చేస్తే  మరిన్నేళ్ళు శివసేన మహారాష్ట్ర  రాజకీయం  చేయగలిగే బలం వస్తుందని నమ్ముతోంది. దాంతోనే బీజేపీని నిలువరించి మరీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుపట్టింది. ఈ పరిణామాలు చూస్తూంటే ఆదిత్య  ధాకరే కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా  కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: