కాచిగూడ రైల్వే స్టేషన్ లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. వెలుతురు తగ్గటంతో లైటింగ్ ఏర్పాటు చేసుకొని సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది అతి కష్టం మీద 8 గంటలు కష్టపడి లోకో పైలట్ ను రైలు నుండి బయటకు తీశారు. ప్రస్తుతం లోకో పైలట్ క్షేమంగానే ఉన్నాడని తెలుస్తోంది. సిబ్బంది గ్యాస్ కట్టర్ల సహాయంతో క్యాబిన్ విడిభాగాలను తొలగించి లోకో పైలట్ ను బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 
 
లోకో పైలట్ శేఖర్ కు ప్రాణాపయం కలగకుండా సిబ్బంది క్యాబిన్ లో ఉన్న సమయంలో గ్లూకోజ్, సెలైన్ అందించారు. ఈరోజు ఉదయం కాచిగూడలో ఆగి ఉన్న ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొన్న ఘటనలో లోకో పైలట్ శేఖర్ క్యాబిన్ లో చిక్కుకున్నాడు. ప్రమాదంలో క్యాబిన్ నుజ్జు నుజ్జు అయింది. లోకో పైలట్ శేఖర్ ప్రాణాలకు ఏ ప్రమాదం లేకపోయినా తీవ్రంగా గాయాలు మాత్రం అయినట్లు సమాచారం అందుతోంది. 
 
ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే అధికారులు మానవ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. లోకో పైలట్ శేఖర్ సురక్షితంగా బయట పడటంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 
 
ప్రస్తుతం లోకో పైలట్ శేఖర్ నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికారులు లోకోపైలట్ శేఖర్ ను సురక్షితంగా రక్షించటంతో సహాయక సిబ్బందికి, ఎన్ డీ.ఆర్.ఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొందరు మాత్రం సిగ్నల్ చూసుకోకపోవటంతో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చాయని సాంకేతిక లోపం వలనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పూర్తి స్థాయి విచారణ తరువాత ప్రమాదానికి కారణం లోకో పైలట్ తప్పిదమా...? సాంకేతిక లోపమా...? అనే విషయం తెలిసే అవకాశం ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: