ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని టార్గెట్ చేసేందుకు..ప్ర‌తిప‌క్షాలు అందివ‌చ్చిన ప్ర‌తి అవకాశాన్ని వాడుకుంటున్నాయి. తాజాగా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్యమం బోధ‌న‌పై జ‌గ‌న్ అన్ని పార్టీల‌కు టార్గెట్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు గురించి సీఎం జ‌గ‌న్‌ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామ‌ని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్యనాయుడు పాత్ర ఎనలేనిదని ఆయ‌న కొనియాడారు. 


మాతృభాషలో బోధన ఉండాలని మాత్రమే ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌ సూచించారని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పేర్కొన్నారు. ``ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్యనాయుడుని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదు. గతంలో తెదేపా హయాంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు నిర్ణ‌యాన్ని జగన్ తీవ్రంగా విమర్శించారు . అప్పుడు ఇంగ్లీషు మీడియం వద్దని.. ఇపుడు ఎలా ప్రవేశపెడతారు?`` అని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సూటిగా ప్ర‌శ్నించారు. నిర్బంధంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. `ఎన్నో ఏళ్లు పోరాడి తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్నాం. తన తండ్రి వైయస్ హయాంలోనే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన విషయం జగన్ గుర్తించుకోవాలి. ఆ విష‌యం తెలిస్తే...జ‌గ‌న్ ఇలా చేసేవారు కాదేమో`` అని క‌న్నా వ్యాఖ్యానించారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని... మాతృభాషలో భోదన కూడా ఉండాలనేది త‌మ డిమాండ్ అని క‌న్నా తెలిపారు. ``తెలుగు మీడియం కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టండి. వెంకయ్యనాయుడు చేసిన సూచన పాటిస్తే సరే లేకపోతే లేదు. ఉపరాష్ట్రపతిపై  చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. `` అని డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో ఇంకా ఇసుక కొరత తీరలేదని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు. ``మద్యం పాలసీ వెంటనే అమలు చేసిన వాళ్లు ఇసుకను ఎందుకు ఆపివేశారు? దీని వెనుక ముఖ్యమంత్రి రహస్య ఎజెండా ఏమిటో  బయటపెట్టాలి. ఇసుక కొరత తీరకుండానే ఇపుడు సిమెంటు ధరలు పెంచారు. ఇది కూడా ప్రజలపై అదనంగా భారం మోపడమే అవుతుంది. బీజేపీ ప్రజలపక్షాన ఒంటరిగానే ఉద్యమాలు చేస్తుంది. గృహ నిర్మాణ రంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుత్సాహపర్చటం సరికాదు.`` అని ఆయ‌న త‌మ పార్టీ వైఖ‌రిని తేల్చిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: