మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశగా సాగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఏ పార్టీకి మెజారిటీ లేకపోవడం, అక్కడ నాలుగు పార్టీలు ఉండడం, ఒక పార్టీతో మరో పార్టీకి సిధ్ధాంతపరమైన భేదాలు పక్కన పెడితే అనుమానాలు, అధికార దాహాలు పెరిగిపోవడంతో మహా రాజకీయం ఇపుడు వేడెక్కిపోతోంది. మూడు రోజుల వ్యవధిలో మూడవ పార్టీ ఎన్సీపీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.


అందరికీ ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఇస్తున్నారు. అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ తరువాత వరసగా శివసేన, ఎన్సీపీ, తరువాత కాంగ్రెస్ కి కూడా గవర్నర్ ఆహ్వానం పలకవచ్చు అందరికీ  ఒక్క రోజు మాత్రమే టైం  ఇవ్వడం, పైగా ఎవరూ కూడా మనస్పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం సాకుగా చూపించి గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్స్ చేయవచ్చునని అంటున్నారు. ఇక్కడే మోడీ మార్క్ పాలిటిక్స్ కనిపిస్తోందని చెబుతున్నారు. అన్ని పార్టీలను అడిగాం, వారు సకాలంలో తమ మెజారిటీని నిరూపించే ఆధారాలు చూపలేకపోయారు కాబట్టి కొన్నాళ్ల పాటు రాష్ట్రపతి పాలన పెడతాను అని గవర్నర్ అంటే వెంటనే రాజముద్ర వేసి సై అనే అవకాశాలనే ఇపుడు  కేంద్రం పరిశీలిస్తోందని  అంటున్నారు.


సహజమైన మిత్రులుగా ఉన్న బీజీపే శివసేనల మధ్య పొత్తులు పెటాకులు కావడంతో అక్కడ రాష్ట్రపతి పాలన తప్పదన్న అంచనాలు మొదటే  ఉన్నాయి. అయితే అంతా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా సాఫీగా సాగాలి. అందరి అభిప్రాయాలను తీసుకున్నామని అనిపించుకోవాలి. అందరి అసక్త‌తతను లోకానికి చూపాలి. ఇదే మోడీ, అమిత్ షా మార్క్ పాలిటిక్స్.  ఇక శివసేన సర్కార్ ఏర్పాటు కు రెడీ అన్నా సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంలేదు. ఎందుకంటే  ఫక్త్ హిందూ పార్టీ అయిన శివసేనకు మద్దతు ఇస్తే ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయన్న బెంగ కాంగ్రెస్ కి ఉంది. మరో వైపు ఎన్సీపీ కూడా ప్రతిపక్షంలో కూర్చోవడానికే ఇష్టపడుతోంది.


ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొంతకాలం విధిస్తే పరిస్థితులు చక్కబడతాయని, శివసేన సైతం దారికి వస్తుందన్న ఆలోచన కూడా బీజేపీకి ఉంది. అదే సమయంలో శివసేనలో అసమ్మతి కూడా రేగే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఇపుడు నిదానమే ప్రధానం అన్న తీరులో బీజేపీ ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. పైగా అమిత్ షా, మోడీ అక్కడ ఉన్నారు. వారిని కాదని సర్కార్ ఏర్పాటు చేయడం, మూడు నాళ్ళైనా ఉంచగ‌లిగే  ధైర్యం ఉందా ఎవరికైనా  అన్నది ఇపుడు వినిపిస్తున్న ప్రశ్న. సో రాష్ట్రపతిపాలన అనివార్యం అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: