బీజేపీలో ఏపీలో బలపడాలని చూస్తోంది. అయితే పార్టీలో ఉన్న నాయకుల తీరు వేరేగా ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణ మొదటి నుంచి ఉన్న పార్టీ సీనియర్  నాయకులను కాదని బీజేపీ అధ్యక్ష కిరీటం పట్టుకుపోయారు. అప్పట్లో సీనియర్ నేత సోము వీర్రాజు దీని మీద  అలిగిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబుకు మద్దతుగా ఉన్న ఓ వర్గం సైతం కన్నా నియామకంపైన మండిపోయింది.


ఇవన్నీ ఇలా ఉంటే కన్నా లక్ష్మీ నారాయణ ప్రెసిడెంట్ అయ్యాక బీజేపీ ఏపీలో ఎత్తిగిల్లలేదు సరికదా నోటా కంటే కూడా ఇంకా తక్కువ ఓట్లు తెచ్చుకుని కొత్త రికార్డు స్రుష్టించింది. కన్నా కాంగ్రెస్ లో మంత్రి,  పైగా బలమైన కాపు సామాజికవర్గం నేత, ఆయన్ని సారధిగా చేస్తే ఏపీలో బీజేపీ బతికి బట్టక‌డుతుందని  హై కమాండ్ భావించింది. అయితే కన్నాకు అంత సీన్ లేదని తేలిపోయిన వేళ బీజేపీలోకి మళ్ళీ టీడీపీ నుంచి కొత్త నాయకులను తీసుకున్నారు. సుజనా చౌదరి లాంటి వారు ఇపుడు అసలు కాషాయల కంటే ఎక్కువగా మెరిసిపోతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా కన్నా సైతం బీజేపీలోని టీడీపీ సపోర్ట్ గ్రూప్ లో చేరిపోవడంతో కమలం పార్టీ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఈ నేపధ్యంలో మొదటి నుంచి బీజేపీలో బాబు సానుభూతిపరులను వ్యతిరేకిస్తూ వస్తున్న సోము వీర్రాజు. హఠాత్తుగా జగన్ని కలవడం సంచలనం రేపింది.


పైగా ఆయన జగన్ విధాలనకు మద్దతుగా మాట్లాడడంతో పాటు, బాబు పాలనలో  విద్య, వైద్య రంగాల్లో పెద్ద అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం విశేషం. మరో వైపు బాబు పాలనలో రాజధాని ఖర్చు ఏడు వేల కోట్లు పైగా అంటున్నారని, ఆ భారీ నిధులు ఎక్కడ ఖర్ఛు చేశారో  దాని మీద కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో కమలం పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. మరో వైపు కన్నా బాబు ఇసుక దీక్షకు మద్దతు ఇచ్చేశారు.  మరి బీజేపీ హై కమాండ్ బాబుకు మద్దతుగా ఉన్న గ్రూప్ ను ప్రోత్సహిస్తుందా, లేక ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు లాంటి వారికి మద్దతు ఇస్తుందా అన్నది చూడాలి. అసలు ఏపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో కూడా తెలియాల్సివుంది. అలాగే టీడీపీ విషయంలో కూడా కమలం పెద్దలు ఏమనుకుంటున్నారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: