ఊహించినట్టుగానే మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతిపాలన దిశగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. ఈమేరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రసార భారతి ట్వీట్ చేయడం కూడా అనుమానాలను ధ్రువీకరిస్తోంది.


మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కు అన్ని పార్టీలు విఫలం అయ్యాయని గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫారసు చేశారని భావిస్తున్నారు. గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్రం మంత్రి మండలి అత్యవసరంగా సమావేశమై రాష్ట్రపతి పాలనకు నిర్ణయించినట్టు చెబుతున్నారు.


ఈ మేరకు జాతీయ మీడియా అంతా కోడై కూస్తోంది. కానీ రాజ్ భవన్ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రపతిపాలన వార్తలను శివసేన మండిపడింది. ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తి కాక ముందే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫార్సు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఎలాంటి న్యాయపోరాటం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.


ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బ్రిక్స్ పర్యటన కోసం బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని మోడీ.. అంతకుముందే ఈ కేబినెట్ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తే మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఖాయమైనట్టు తెలుస్తోంది.


మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ- శివసేన.. ఎన్నికల తర్వాత మాత్రం ఆ స్నేహం కొనసాగించలేకపోయాయి. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విషయంలో శివసేన పట్టుబట్టగా బీజేపీ మాత్రం ససేమిరా అన్నది. చివరకు మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకైనా సరే రెండు పార్టీలు సిద్ధపడటంతో మహారాష్ట్ర రాజకీయం వారం రోజులుగా అనేక మలుపులు తిరిగింది. చివరకు రాష్ట్రపతి పాలన క్లైమాక్స్ గా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: