రెవెన్యూ ఉద్యోగులు మ‌రోమారు సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. రెండేళ్లుగా ఏసీబీకి చిక్కిన 207 మంది అధికారులతో కూడిన జాబితా తాజాగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అందులో 50 మంది రెవెన్యూ అధికారుల పేర్లను ప్రస్తావించారు.  కొందరు కావాలనే రెండేళ్ల‌ నుంచి ఏసీబీకి పట్టుబడిన ఆయా శాఖల అధికారులతో కూడిన పేర్లతో సోషల్‌మీడియాలో పెట్టారనే విమర్శలొస్తున్నాయి. 


ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో ఓ ఎమ్మెల్యే కీలక అనుచరుడికి విజయారెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్‌తో సత్సంబంధాలు వెలుగులోకి రావడం, మరోవైపు ఘటన జరిగిన రోజు ఓ కారులోని వ్యక్తులతో సురేష్‌ మాట్లాడినట్టు సీసీ ఫుటేజీల్లో సాక్ష్యాలు లభించడం వంటివి చూస్తుంటే కచ్చితంగా ఈ ఘటన వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.   హత్య వెనుక ల్యాండ్‌ మాఫియా పాత్ర ఉందనీ, అందులోనూ రెండు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ఉన్నారని చ‌ర్చ జ‌రిగింది. విజయారెడ్డి హ‌త్య‌కు నీవంటే నీవే కారణం అని ఆ నేతలిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం అటూ, ఇటూ పోయి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని కొంద‌రు ఇలా కావాల‌ని చేస్తున్నారంటున్నారు.


అయితే, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఈ ఘ‌ట‌న‌పై మండిప‌డ్డారు. కొంద‌రు ఉద్దేశపూర్వకంగానే రెవెన్యూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగులు నిత్యం ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, కానీ విజ‌యారెడ్డి హ‌త్య త‌ర్వాత‌ స్వేచ్ఛగా ప్రజల దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని లచ్చిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి తాము 58 లక్షల పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను ఇస్తే అప్పుడు శభాష్‌ అన్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని భూ స‌మస్యలకు రెవెన్యూ ఉద్యోగులే కార‌కులన్నట్లుగా చెబుతున్నార‌ని, చ‌ట్టాల్లో ఉన్న గంద‌ర‌గోళం, సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు, ఉద్యోగుల కొర‌తతోనే ఎక్కువ భూస‌మ‌స్యల వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఇక నుంచి రెవెన్యూ జేఏసీగానే పోరాడుతామని స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: