టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరాన్ని ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల వరకు.. చిత్తూరు జిల్లా వాసులకు నియామకంలో 75 శాతం కోటాని అమలు చెయ్యాలని ప్రతిపాదించారు టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుడు భూమాన కరుణాకర్ రెడ్డి. దీంతో ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకమండలి...పూర్తి స్థాయి ఆదేశాలు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే... టీటీడీలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి.


తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది. 1996లో శ్రీవారి దర్శనార్దం విచ్చేసే భక్తులు సంఖ్య సాధారణ రోజులలో 20 వేలు... సెలవు రోజులలో 30 వేలు వరకు వుంటే.....టీటీడీ ఉద్యోగులు 16 వేలు మంది ఉండేవారు. అటు తరువాత శ్రీవారి దర్శనార్దం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది.  ప్రస్తుతం సాధారణ రోజులలో వచ్చే భక్తుల సంఖ్య 60 వేలుకు చేరుకుంటే...సెలవు రోజులలో ఈ సంఖ్య లక్ష వరకు చేరుకుంది.  


భక్తులు రద్దీకి అనుగుణంగా టీటీడీలో ఉద్యోగులు సంఖ్య పెరగాల్సి వుండగా...అందుకు విరుద్ధంగా ఉద్యోగులు సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తుంది. ప్రస్తుతం టీటీడీలో ఉద్యోగులు సంఖ్య 7300 కు చేరుకుంది. మరో వైపు గతంలో తిరుమల తిరుపతి వరకు పరిమితమైన టీటీడీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో 50 ఆలయాలు టీటీడీ పరిధిలో  ఉంటే....ఇక అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తుంది. దీనితో సిబ్బంది కొరత కారణంగా వున్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. 


2009లోనే అప్పటి అవసరాల దృష్ట్యా 2 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించినా.. టీటీడి మాత్రం 450 పోస్టులు భర్తీతో సరిపెట్టేసింది. అందుకు కారణం లేకపోలేదు. ఉద్యోగులు నియామకం సంబంధించి రాష్ట్రం అంతా ఒక్క యూనిట్ గా పేర్కొంటూ...టీటీడీ నియామకాలు చేయడంతో చిత్తూరు జిల్లావాసులకు కోటా లేకపోవడం వివాదస్పదమైంది. టీటీడీ కూడా నియామకాలను పక్కన పెట్టేసి అవుట్ సోర్సింగ్ విధానంతో నియామకానికి ప్రాధాన్యత  ఇస్తూ వచ్చింది. దీనితో పరిపాలన నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం టీటీడీలో శాశ్వత ప్రాతిపాదికన పనిచేసే వారి సంఖ్య 7,300 ఉంటే..... అవుట్ సోర్సింగ్ విధానంలో 13 వేల మంది పైగా వున్నారు. 


1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి టీటీడీ ఉద్యోగుల నియామకానికి సంబంధించి చిత్తూరు జిల్లా వాసులకు ప్రాధ్యనత వుండేది. ఉద్యోగులుగా స్థానికులకే అవకాశం వుండేది. అందు కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులను కూడా ఇచ్చింది. ఇదే సంప్రదాయం 1996 వరకు టీటీడీలో కోనసాగుతూ వచ్చింది. 1996లో ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు టీటీడీకి వర్తించవు అంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేఫధ్యంలో టీటీడీలో జీఓ నెంబర్ 1060 మేరకు ఉద్యోగాల నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఒక్క యూనిట్ గానే పరిగణిస్తూ ఉద్యోగ నియామకం చేపట్టాలని టీటీడీ ఆదేశించింది ప్రభుత్వం. దీంతో  ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మొదటి దశలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్న ప్రతిపాదనలు పాలకమండలి ముందు ఉంచారు అధికారులు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కూడా పరిశ్రమలు ఏర్పాటు సమయంలో ఉద్యోగుల నియామకంలో 75 శాతం స్థానికులు ఇవ్వాలి అన్న నిబంధనను తీసుకురావడంతో.. టీటీడీలో కూడా అదే నిబంధనను వర్తింప చేయాలి అంటూ ప్రతిపాదించారు కరుణాకర్ రెడ్డి. దీనిపై సానుకూలంగా స్పందించిన పాలకమండలి.. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు నియమాకం వరకు 75 శాతం కోటా నిబంధనను జిల్లా వాసులకు అమలు చెయ్యాలని తీర్మానించడంతో పాటు......పూర్తి స్థాయి ఉత్తర్వులు కోసం ప్రభుత్వానికి నివేదించింది పాలకమండలి. దీనితో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాగానే ఉద్యోగులు నియామకం నోటిఫికేషన్ జారీ చేయ్యాలని భావిస్తున్నారు అధికారులు. మొత్తానికి చిత్తూరు జిల్లా వాసులకు టీటీడీలో ఉద్యోగులు నియామకంపై  తీపి కబురును పంపింది పాలకమండలి.





మరింత సమాచారం తెలుసుకోండి: