ఇసుక రాజకీయం రాజుకుంటున్న సమయంలో వాటికి చెక్ పెట్టే దిశగా సర్కార్ చర్యలు ప్రారంభించింది. ప్రతిపక్ష నేత ఇసుక దీక్షకు సిద్ధమవుతున్న రోజు నుంచే ఇసుక వారోత్సవాలు జరపాలని ఆదేశించారు సీఎం. మరోవైపు ఇసుక కొరత నివారణ,  అక్రమ రవాణకు అడ్డుకట్టవేసే దిశగా... పటిష్ట చట్టాన్ని రూపొందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. రెండు మూడు వారాల్లో ఏసీబీని రంగంలోకి దించనున్నట్లు హెచ్చరికలు పంపారు.


ఏపీలో ఇసుక స‌మ‌స్యపై సీఎం జ‌గన్ దృష్టి సారించారు. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చినా.. కృష్ణా-గోదావరి నదుల్లోకి పెద్ద ఎత్తున వరద రావడంతో ఇసుక రీచుల్లోకి భారీ స్థాయిలో నీరు చేరుకుంది. దీంతో ఇసుక కొరత ఏర్పడింది. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేయడం.. దాన్ని ప్రతిపక్షాలు భుజాన వేసుకోవడంతో ఏపీలో శాండ్ పాలిటిక్స్ కాక రేపుతోంది. ఇప్పటికే ఇసుక విషయంలో జనసేనాని లాంగ్ మార్చ్, వామపక్ష పార్టీలు శాండ్ మార్చ్ నిర్వహించారు. ఇక ఈ నెల 14వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక దీక్షను చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో గతంలోనే ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న సర్కార్.. ఇప్పుడు వాటి తేదీలను డిసైడ్ చేసింది.  ఈ నెల 14 నుంచి వారం రోజులపాటు... ఇసుక వారోత్సవాలు జరపాలనీ.. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయింట్లు పెంచాలని సీఎం ఆదేశించారు. ఇక రేపో, ఎల్లుండో ఇసుక‌ రేటు కార్డు డిసైడ్‌ చేయనుంది ప్రభుత్వం. నియోజకవర్గాల వారీగా ఇసుక‌ రేటు ప్రకటించనుంది.


మరోవైపు, ఇసుక అక్రమ రవాణను అరికట్టేందుకు జగన్ సర్కార్ పకడ్బందీగా వెళ్తోంది. రీచులు,  స్టాక్ పాయింట్ల వద్ద భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు.. కఠిన చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది జగన్ సర్కార్. ఇసుక అక్రమ రవాణ చేపడితే రెండేళ్ల పాటు శిక్ష విధించేలా కొత్తం చట్టం తీసుకురానుంది. రేపటి కేబినెట్ మీటింగ్‌లో ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికంటే ముందుగానే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని అమల్లోకి తేవాలని సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం.


ఇదే సందర్భంలో సీఎం జగన్ మరికొన్ని కీలకాంశాలను ప్రకటించారు. అర్జీల పరిష్కారం విషయంలో ఎక్కడా ఎలాంటి అవినీతికి పాల్పడకూడదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం అవినీతి నిర్మూలన విషయంలో ఎంత కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే రెండు మూడు వారాల్లో ఏసీబీని రంగంలోకి దించబోతున్నట్లు సీఎం హెచ్చరికలు పంపారు. రైతు భరోసా, ఇళ్ల పట్టాల పంపిణీ, ఫించన్లు.. ఆరోగ్య శ్రీ, గ్రామ సచివాలయాల వంటి అంశాలతోపాటు.. వివిధ సంక్షేమ పథకాలపై సీఎం జగన్ పూర్తి స్థాయిలో సమీక్షించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: