ఏపీలో అధికార వైసీపీని ఏదైనా విషయంలో విమర్శించాలంటే అది ఒక్క ఇసుక విషయంలోనే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు మేలు చేసే పథకాలు, నిర్ణయాలు అమలు చేస్తున్న ఒక ఇసుక విషయంలో మాత్రం తప్పటడుగు వేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు మూడు నెలల పాటు ఆపేసి సెప్టెంబర్ లో కొత్త పాలసీ తీసుకొచ్చారు. అయితే ఇసుక తవ్వకాలు జరగని మూడు నెలలు అనేకమంది భవన నిర్మాణానికి చెందిన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


అయితే కొత్త పాలసీ తీసుకొచ్చిన ఇసుక ఇబ్బందులు ఆగలేదు. దీంతో కొందరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ధర్నాలు , ఆందోళనలు చేపట్టారు. ఇటీవల జనసేన కూడా విశాఖలో లాంగ్ మార్చ్ పెట్టింది. ఇక తాజాగా చంద్రబాబు కూడా ఇసుకపై 12 గంటలు దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు.


ఈ నెల14 న విజయవాడలో దీక్ష చేయడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఈ దీక్షకు బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల మద్దతు కోరుతున్నారు. అయితే ఇలా బాబు దీక్ష చేస్తున్న సమయాన్ని చూసే సీఎం జగన్ గట్టి దెబ్బ కొట్టారు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై రాజకీయం చేయాలని భావిస్తున్న టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఇసుకని అధిక స్థాయిలో అందుబాటులోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం...ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో తెచ్చేందుకు ఈ నెల 14 నుంచి 21వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.


అయితే ఈ నిర్ణయంతో బాబు దీక్ష ఫ్లాప్ అయిపోయినట్లే అని అర్ధమైపోతుంది. పూర్తిగా ఇసుక అందుబాటులోకి వస్తే బాబు దీక్ష వల్ల ఒరిగేదేమీ లేదు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న ఒక్క సమస్యని అవకాశం మలుచుకుని రాజకీయం చేస్తున్న బాబుకు జగన్ చెక్ పెట్టారనే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: