దాదాపు 40 రోజులుగా.... తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ ఆర్టీసీ స‌మ్మెకు శుభం కార్డు ప‌డ‌నుందా?  కీల‌క ప్ర‌తిపాద‌న‌కు...ఇటు ప్ర‌భుత్వం అటు కార్మికులు ఓకే చెప్పేయ‌డంతో...నిర్ణ‌యం వెలువ‌డ‌ట‌మే ఆల‌స్య‌మా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు.. సమ్మె వ్యవహారాన్ని హైపవర్ కమిటీకి అప్ప‌గించ‌డం, దానికి ఇరు ప‌క్షాలు అంగీక‌రించిన నేప‌థ్యంలో...ఈ మేర‌కు ఓ అంచనా వెలువడుతోంది.


ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై క్యాబినెట్ నిర్ణయం, కొత్త అద్దె బస్సుల టెండర్ల ప్రక్రియపై దాఖలైన అన్ని పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టిన సంద‌ర్భంగా సమ్మె అంశాన్ని పరిష్కరించడానికి ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. హైపవర్ కమిటీ ఏర్పాటు వల్ల ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికసంఘాలకు మధ్య ఏర్పడిన వివాదం సమసిపోతుందని తెలిపింది.  హైప‌వ‌ర్ క‌మిటీకి నివేదించడంపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. హైపవర్ కమిటీ ఏర్పాటు అంశాన్ని సీరియస్‌గా కన్సిడర్ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నది అని ధర్మాసనం పేర్కొన్నది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు హైకోర్టు కంటే అన్ని రకాలుగా యోగ్యత కలిగి ఉంటారని న్యాయస్థానం అభిప్రాయపడింది. 0.001 శాతం ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడానికి చిట్టచివరిగా ఈ ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. దీనిపై అభిప్రాయం చెప్పాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం కోరింది. ఈ అంశంపై తాను ప్రభుత్వం నుంచి సూచన తీసుకోవాలని, ఇప్పటికిప్పుడు అభిప్రాయం చెప్పలేనని ఏజీ పేర్కొన్నారు. ఇప్పుడే చెప్పాలని అనడంలేదని, ప్రభుత్వంతో చర్చించి బుధవారం అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం సూచించింది.  దీంతో బాల్ రాష్ట్ర ప్ర‌భుత్వం కోర్టులోకి చేరింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.


కాగా, కార్మికసంఘాల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో నియమించే హైపవర్ కమిటీ నిర్వహించే చర్చలు తమకు సమ్మతమేనని తెలిపారు. ఈ ప్రతిష్టంభనను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులకు నివేదిస్తే సమ్మె కొనసాగించాలనే నిర్ణయాన్ని పునరాలోచిస్తామని పేర్కొన్నారు. ప్రకాశ్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను ధర్మాసనం రికార్డు చేసింది. అనంతరం సమ్మెపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: