హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో చేసిన సూచనపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్టు చెప్పిన కమిటీ నిర్ణయం గురించి అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అధికారులకు హైకోర్టులో ప్రభుత్వం వినిపించాల్సిన వాదనలపై దిశానిర్దేశం చేయడంతో పాటు కమిటీకి అంగీకరించాలా...? వద్దా...? అనే విషయం గురించి చర్చించినట్లు సమాచారం. 
 
హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేస్తామని ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని సమర్థిస్తూ బలమైన వాదనల్ని వినిపించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ల గురించి, ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ప్రభుత్వం వినిపించాల్సిన 
వాదనలను  సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో గతంలో చర్చలు జరిపామని మళ్లీ ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని  కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం చర్చలకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించాయి. నిన్న హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సీఎంకు వివరించారు. 
 
సీఎస్ జోషీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలతో మరలా చర్చలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు మరో ఆర్టీసీ డ్రైవర్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబాబాద్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేశ్ ఈరోజు తెల్లవారుజామున పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ నరేశ్ మృతదేహాన్ని డిపోకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కాకపోవటంతో ఆవుల నరేశ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: