ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను ఊపేస్తున్న ఇసుక కొర‌త‌ అంశంపై తెలుగుదేశం పార్టీ  జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు ఆయ‌న అనుకూల మీడియా నుంచే షాక్ త‌గిలింది.  రాష్ట్రంలో ఇసుక కొర‌త తీరుతోందంటూ ఆధారాలు.. ఉదాహార‌ణ‌లు.. లెక్క‌ల‌తో సహా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డెయిలీగా చెప్పుకునే పత్రిక  క‌థ‌నం ప్ర‌చురితం చేయ‌డంతో టీడీపీ వ‌ర్గాలు డైలామాలో ప‌డ్డాయి.  ఎప్పుడూ చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌బ‌డే ప‌త్రిక భిన్నంగా ఈ క‌థ‌నం రావ‌డంతో ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ సాగుతోంది.  చంద్ర‌బాబు చెప్పిన నిర‌స‌న దీక్ష‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌గానే ఈ ప‌రిణామం చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.


ఎక్కుపెట్టిన బాణంను ఎటు వ‌ద‌లాలో తెలియ‌క చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని వైసీపీ వ‌ర్గాలు జోకులు వేసుకుంటున్నాయి. మేం మొద‌టి నుంచి చెబుతున్న‌దే నిజ‌మైంది... వాన‌లు...వ‌ర‌ద‌లు త‌గ్గాక ఇసుక కొర‌త అంటూ ఉండ‌ద‌ని..ఇప్పుడు అదే జ‌రుగుతోంది.. కావాలంటే చంద్ర‌బాబు ఆస్థాన ప‌త్రిక‌నే ప్ర‌చురించిన క‌థ‌నం చ‌దువుకోవాల‌ని టీడీపీ నేత‌ల‌కు వైసీపీ నేత‌లు సూచిస్తున్నార‌ట‌. దీంతో టీడీపీ శ్రేణులు ఇదెక్క‌డి చిక్కురా నాయ‌నా అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. అందివ‌చ్చిన ఓ స‌మ‌స్యా అవ‌కాశాన్ని అనుకూలంగా మార్చుకుని జ‌నంలోకి వెళ్దామంటే  డామిట్ క‌థ అడ్డం తిరుగుతోంది అంటూ నిట్టూరిస్తున్నార‌ట‌.


వాన‌లు పోయాయి...క్ర‌మ‌నుగుణంగా వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక పెద్ద‌గా ఇసుక ల‌భ్య‌త‌కు ఆటంకం ఏమీ ఉండ‌బోద‌న్న రీతిలో స‌ద‌రు ప‌త్రిక త‌న క‌థ‌నంలో వివ‌రించింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొర‌త తీరిన‌ట్లేన‌ని తేల్చేసింది. ఆన్ లైన్ ఇసుక బుకింగ్ లో కూడా ఇప్పుడు ఎక్కువ సమయం లభ్యమ‌వుతోంద‌ని, కావాల్సిన వారు బుక్ చేసుకుంటే స‌రిపోతుంద‌ని క‌థ‌నంలో పేర్కొంది. అలాగే బల్క్ బుకింగ్స్ మీద ప్రభుత్వం  దృష్టి పెట్టినట్టుగా వివరించింది. ఇసుక ఎక్కువ గా బుక్ చేసుకుని దాన్ని బ్లాక్ చేసే వాళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు గా వివరించింది.


వాస్త‌వానికి చంద్ర‌బాబు నాయుడు ఇసుక‌పై స‌మ‌రభేరి మోగిస్తూ దీక్ష‌కు కూర్చోవ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది. ఈ లోపే స‌ద‌రు టీడీపీ అనుకూల ప‌త్రిక అబ్బే రాష్ట్రంలో అస‌లు ఇసుక కొర‌తే లేదుగా అంటూ లెక్క‌లు...సాక్ష్యాల‌తో తేల్చ‌య‌డంతో పార్టీ శ్రేణులు బిత్త‌ర పోవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. దీక్షలో పాల్గొనే చంద్ర‌బాబు ఇప్పుడు ఏం చెప్ప‌బోతున్నార‌నే దానిపైనే అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: