తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెకు శుభం కార్డు ప‌డ‌టం...అంత ఈజీ అన్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. యాజమాన్యం, కార్మికసంఘాల మధ్య తలెత్తిన పారిశ్రామిక వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల హైపవర్‌ కమిటీపై చాలా మందికి ఆశ‌లు రేకెత్తించ‌గా...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం లైట్ తీసుకున్నారు. సమ్మె అంశం లేబర్‌ కమిషనర్‌ పరిధిలో ఉన్నందున ప్రస్తుత దశలో హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు అంగీకరించలేమని బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ సీఎస్‌ ఎస్కే జోషి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సదరు అఫిడవిట్‌ను చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానందప్రసాద్‌ సమర్పించారు. దీంతో కీల‌క అంశంపై అస్ప‌ష్ట‌త కొన‌సాగుతోంది.


సాక్షాత్తు న్యాయ‌స్థానం చేసిన వాద‌న‌ను తోసిపుచ్చుతూ...తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం గురించి  అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానందప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ (ఎస్మా) సెక్షన్‌ 2 (1) (ఏ) ప్రకారం రోడ్డురవాణా కూడా అత్యవసర సర్వీస్‌గా ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్మా ప్రకారం పబ్లిక్‌ యుటిలిటీ సర్వీసులన్నీ అత్యవసర సర్వీసులేనని స్పష్టంచేశారు. ఆర్టీసీని అత్యవసర సర్వీస్‌గా గుర్తిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసిందని పేర్కొన్నారు. సదరు జీవో ఆరునెలల కాలానికి జారీచేశారని, దానిని అలాగే ఆరునెలలకు ఒకసారి ప్రభుత్వం పొడిగిస్తున్నదని తెలిపారు. దీంతోపాటు ఆర్టీసీని అత్యవసర సర్వీసుగా గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998లో జీవో నంబర్‌ 180ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి టీఎస్‌ఆర్టీసీ ఏర్పడినందున ఆ జీవో అలాగే కొనసాగుతుందని, ఈ లెక్కన ఆర్టీసీ ఇప్పటికీ అత్యవసర సర్వీసు కిందనే ఉన్నదని తెలిపారు. ఎస్మా ప్రకారం అత్యవసర సేవల్లో ఉన్నవారు సమ్మె చేయరాదని, కనుక ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని వాదించారు.


ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ (ఐడీ యాక్ట్‌) ప్రకారం వ్యవహరిస్తామని, ఐడీ యాక్ట్‌లో కమిటీల ప్రస్తావన లేదని ఏజీ తెలిపారు. పారిశ్రామిక వివాదాలను పరిష్కరించేందుకు ఐడీ యాక్ట్‌లో అన్నిరకాల పరిష్కార మార్గాలు, వ్యవస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.
వివాదాల పరిష్కారంలో ఏర్పాటుచేసే కమిటీలకు పరిధి చాలా పరిమితంగా ఉంటుందని ధర్మాసనానికి ఏజీ వివరించారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 కేసులో సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు. అడ్వకేట్‌ల కమిటీ ఏర్పాటును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టిందని గుర్తుచేశారు. వివాద పరిష్కారానికి ఐడీ యాక్ట్‌లో అన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: