సుప్రీంకోర్టు ఇప్పటికే అయోధ్య స్థల వివాదంపై చారిత్రాత్మక తీర్పును శనివారం రోజున వెల్లడించింది. నిన్న సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈరోజు సుప్రీంకోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, శబరిమల వివాదానికి సంబంధించిన తీర్పులను వెలువరించనుంది. 
 
2018 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయస్సు గల మహిళలకు ప్రవేశంపై ఉన్న ఆంక్షల నిషేధం చెల్లదని సుప్రీం తీర్పును వెలువరించింది. హిందూ పక్షాలు మాత్రం కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి నెలలో విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 
 
ఈరోజు ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించనుంది. 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుండి కొనుగోలు చేసిన వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగా కేంద్ర మాజీ మంత్రులు కొందరు తీర్పును సమీక్షించాలని పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్రం కొన్ని కీలకమైన విషయాలను కోర్టుకు చెప్పకుండా దాచేసిందని కేంద్ర మాజీ మంత్రులు ఆరోపణలు చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ గతంలో చౌకీదార్ చోర్ హై అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు కూడా ఆమోదించిందని రాహుల్ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు కేసులలో దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీం కోర్టు కీలక తీర్పులను వెలువరించనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: