టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలని చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తొస్తుంటుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలా...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా రాజకీయాలు చేస్తూ గురివింద గింజని మించిపోతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి బాబు..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇసుక కొరతపై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇసుక కొరతని నిరసిస్తూ 12 గంటల దీక్షకు కూడా దిగారు.


సరే రాష్ట్రంలో ఇసుక సమస్య ఉంది. కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీక్ష చేస్తున్నారనుకోవచ్చు. అయితే ఇసుక కొరత ఉందని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంటూ, కొరతని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే ఈ ఇసుక కొరతకు ముఖ్య కారణమే గత టీడీపీ ప్రభుత్వమని అందరికీ తెలుసు. గతంలో టీడీపీ ఇసుకలో విపరీతమైన అక్రమాలకు పాల్పడటం వల్ల జగన్ ఇసుక తవ్వకాలు ఆపేసి కొత్త పాలసీని తీసుకొచ్చారు.


దాని తర్వాత వరదలు ఒకటి వచ్చాయి. దాని వల్ల ఇసుక లభ్యత తక్కువైపోయింది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా బాబు జగన్ ప్రభుత్వం ఇసుకలో అక్రమాలకు పాల్పడుతుందని నిసిగ్గుగా విమర్శలు చేస్తున్నారు. పైగా వైసీపీలో ఇసుకాసురులు అంటూ టీడీపీ ఓ పెద్ద లిస్ట్ కూడా విడుదల చేసింది. ఈ లిస్ట్ విడుదల చేసే ముందు తమ టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ఇసుక బకాసురుల లిస్టు విడుదల చేస్తే బాగుండేది. ఇసుక కోసమే కదా అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసింది.


అలాగే ఇప్పుడు ఇసుక దీక్షలో కీలక పాత్ర పోషిస్తున్న దేవినేని ఉమా, బొండా ఉమా, అచ్చెన్నాయుడు, ఆలపాటి రాజా లాంటి వారు అప్పుడు ఇసుకలో ఏ విధంగా దోపిడి చేశారో అందరికీ తెలుసు. అలాగే కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, బండారు సత్యనారాయణ మూర్తి, కొమ్మలపాటి శ్రీధర్ ఇలా ప్రతి జిల్లాలోనూ టీడీపీ హయాంలో ఇసుకని మింగేసిన బకాసురులు చాలామందే ఉన్నారు. ముందు ఈ బకాసురుల లిస్ట్ బయటపెట్టి బాబు ఇప్పుడు దీక్ష చేస్తే అర్ధముండేది.


మరింత సమాచారం తెలుసుకోండి: