అసలే ఆర్టీసీపై జనాల్లో పెద్ద సానుకూలత లేదు. ఎందుకంటే ఆర్టీసీ అంటేనే జనాలు రాదు..తెలీదు..చెప్పలేం అని వ్యంగ్యంగా చెప్పుకోవటం అందరూ వినేవుంటారు. కాకపోతే జనాలకు ఆర్టీసీ బస్సులు తప్ప మరో రవాణా సౌకర్యం లేదు కాబట్టి తిట్టుకుంటునే అయినా ఈ బస్సులనే ఎక్కుతున్నారు.  అలాంటిది గడచిన 41 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మె వల్ల జనాలకు బాగా దూరమైపోయిందనే చెప్పాలి.

 

 సమ్మె మొదలైన రోజుల్లో అలవాటైన బస్సులు లేకపోవటంతో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు.  ఒకవైపు ఆర్టీసీ యూనియన్లు మరో వైపు ప్రభుత్వం దేనికదే తమ డిమాండ్ పైనే పట్టు వీడకపోవటంతో చివరకు జనాలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బందిని విలీనం చేయటం ఎట్టిపరిస్ధితుల్లోను సాధ్యం కాదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. దాంతో ప్రతిష్టంభన ఏర్పడి ఎక్కడి  బస్సులు అక్కడే ఆగిపోయాయి.

 

నిరవధిక సమ్మే అయినా న్యాయస్ధానం జోక్యం కారణంగా ఏదో రోజు పరిష్కారమైపోతుందని జనాలు ఆశించారు.  కానీ కోర్టు కూడా  సమస్య పరిష్కారంలో చేతులెత్తేయటంతో జనాల్లో  సమస్య పరిష్కారం కాదని అర్ధమైపోయింది. అందుకనే మెల్లిమెల్లిగా ప్రత్యామ్నాయాలవైపు జరుగుతున్నారు.

 

ఒకప్పుడంటే ఆర్టీసి బస్సులు తప్ప మరోదారి లేదు. కానీ ఇపుడలా కాదు. ఆటోలున్నాయి. క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఎంఎంటిఎస్ రైలుకు అదనంగా మెట్రో ట్రైన్ సర్వీసులు కూడా ఉన్నాయి. దాంతో జనాలు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను చూసుకుంటున్నారు.

 

ఆర్టీసీ సమ్మె మొదలై ఇప్పటికి 41 రోజులయ్యింది. ఇంకా ఎన్ని రోజులు సమ్మె జరుగుతుందో ఎవరు చెప్పలేకున్నారు. ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులపై కేసియార్ వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారా ? అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. అందుకనే కోర్టు కూడా మొదట్లో  సూచనలు చేసి తర్వాత చేతులెత్తేసింది. ఇప్పటి పరిస్ధితి ఏమిటంటే జనాలు మెల్లిగా ఆర్టీసిని మరచిపోయే పరిస్ధితి వచ్చేస్తోంది. సమ్మె వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?  అన్నది పక్కనపెడితే  జనాలు మాత్రం ఆర్టీసికి దూరంగా వెళిపోతున్నది మాత్రం వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: