టీడీపీ అధినేత చంద్రబాబు   ఇసుక మాఫియా గురించి మాట్లడుతూ  ముఖ్యమంత్రి జగన్ ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నికల్లో ప్రజల్ని అడిగారని.. అవకాశం ఇస్తే ఇప్పుడు మరణశాసనం రాస్తున్నారని మండిపడ్డారు . ఏపీలో మాత్రమే ఇసుకను కబ్జా చేశారని.. ఇసుక మాఫియాను తయారు చేసి రాష్ట్రం మీదకు వదిలారని మండిపడ్డారు.


ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో దొరుకుతోందన్నారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని.. వైసీపీ నేతలు, కార్యకర్తలే ఇసుకను దోచేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకను దోచేస్తున్న ఇంటి దొంగలు జగన్‌కు కనపడరా అంటూ ప్రశ్నించారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ దగ్గర వేదికపై దీక్ష చేపట్టారు. టీడీపీ అధినేత దీక్ష ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటూ దీక్ష కొనసాగనుంది. 


బాబు దీక్షకు పోటీగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా నిరసనకు దిగారు. బందర్ రోడ్డులో తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇసుక మాఫియా పేరుతో టీడీపీ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలన్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. దీంతో బందర్ రోడ్డులో ఉద్రిక్తత ఏర్పడగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు.


చంద్రబాబు ఇసుక పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారని.. చంద్రబాబు మతిపోయి దీక్షలు చేస్తున్నారన్నారు. తనపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేసిందని.. దీనికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ఇదంతా చేస్తున్నారని.. జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 


టీడీపీ హయాంలో ఐదేళ్లు ఇసుకను దోచుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్లీ దీక్షలు చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఇసుక పేరుతో చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని.. ఇకనైనా నాటకాలు ఆపాలని విమర్శించారు. నదుల్లో వరద తగ్గిందని.. ఇక రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. రెండు రోజుల్లో 2 లక్షల టన్నులు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: