ఇసుక అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్షకు దిగారు. ఈ దీక్ష 12 గంటలపాటు సాగనుంది. చంద్రబాబు ఆందోళనకు  మద్దతు తెలియజేసిన జనసేన.. .తమ పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులను పంపింది. వారిలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ ఉన్నారు. ఇసుక కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల చిత్రపటాల దగ్గర నివాళులు అర్పించారు చంద్రబాబు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత.


ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. అధికార పార్టీ నాయకులు అదే పనిగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.  మేము మీకంటే ఎక్కువ తిట్టగలమని అన్నారాయన. లాంగ్‌ మార్చ్‌ నిర్వహించిన పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారని..అలాంటి విమర్శలు మీపైనా...మీ కుటుంబంపైనా చేస్తే తట్టుగోలరా అని ప్రశ్నించారు చంద్రబాబు. 


వైసీపీకి ఒక అవకాశం ఇచ్చిన పేద ప్రజలకు మరణశాసనం కావాలా అని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఏది మంచిదో ఒక్కరోజు కూడా ఆలోచించడం లేదని విమర్శించారు.  రాష్ట్రంలోని డబ్బంతా సీఎం దగ్గరే ఉండాలా? అని ప్రశ్నించారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ.. రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు చంద్రబాబు. 
మన రాష్ట్రంలో ఇసుక దొరకదు కానీ.. పక్క రాష్ట్రాల్లో పుష్కలంగా ఇసుక దొరుకుతుందన్నారు మాజీ సీం చంద్రబాబు. ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదని వాపోయారు. టీడీపీ గతంలో తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల ఎవరూ ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. రైతులు తమ పొలంలోని మట్టిని ఇంటికి తెచ్చుకోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి కావాలా అని ఎద్దేవా చేశారు. ఇసుక బకాసురులు ఎవరో సీఎం జగన్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చంద్రబాబు.  




మరింత సమాచారం తెలుసుకోండి: