చంద్రబాబు ఇసుక దీక్షలో జనసేన నేతలు సందడి చేశారు. చంద్రబాబు దీక్షలో జనసేన నేతలు ఎమ్మెల్యే వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శివ శంకర్  పాల్గొన్నారు. మొన్నటి విశాఖ లాంగ్ మార్చ్ కు టీడీపీ నేతలు హాజరైనందుకు బదులుగా ఇప్పుడు చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన నేతలు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ కు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరైతే.. ఇప్పుడు జనసేన నుంచి ఆ పార్టీకి చెందిన ఏకైనా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.


మద్యం పాలసీ తీసుకురావటానికి ఒక్క రోజు కూడా మద్యం దుకాణాలు ఆగలేదు కానీ... ఇసుక పాలసీకి మాత్రం 4నెలలుగా ఇసుక ఆగిపోయిందని జనసేన నేతలు కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ఇసుక సమస్య పై పొరుగు రాష్ట్రాల్లో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని జనేసేనన నేతలు ఎద్దేవా చేశారు. సమస్యను తీర్చలేని పాలకుడు ప్రశ్నించే వారిపై విమర్శలు చేస్తున్నారని జగన్ తీరుపై మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు.


ఉచిత ఇసుకను ఎందుకు రద్దు చేశారో ప్రభుత్వం వద్ద సమాధానం లేదని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆక్షేపించారు. ఇసుక పేరిట ఎందుకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారో అర్ధం కావటం లేదని జనసేన నేతలు మండిపడ్డారు. పరిపాలన అనుభవంతో చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చారన్న నేతలు.. అప్పుడు ఉచిత ఇసుక పై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశ్నించారు.


151సీట్లిచ్చి గెలిపించిన ప్రజలను రోడ్డున పడేసారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ధ్వజమెత్తారు. ఇసుక కొరతతో ప్రజలకు వేరే దారి లేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మండిపడ్డారు. మొత్తం మీద జనసేన, టీడీపీ పార్టీ ల దీక్షల పరస్పర సహకారం చూస్తే.. ఆ రెండు పార్టీ ఎజెండా ఏంటో అర్థమైపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: