ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిన్న నగరిలోని పీసీఎన్ ఉన్నతపాఠశాలలో నాడు - నేడు కార్యక్రమానికి హాజరై అదనపు గదుల నిర్మాణం కొరకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిల్లలు మాత్రమే కాన్వెంట్ లో ఇంగ్లిష్ చదవాలా...? పేద పిల్లలు ఇంగ్లిష్ చదవకూడదా..? అని ప్రశ్నించారు. తెలుగు భాషపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అంత ప్రేమ ఉంటే తమ పిల్లలను తెలుగు మీడియంలో ఎందుకు చదివించటం లేదని రోజా ప్రశ్నించారు. 
 
బోధన వేరు, భాష వేరు అన్న విషయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో తెలుగు భాషపై అంత ప్రేమ ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకు తొలగించలేదో చెప్పాలని రోజా ప్రశ్నించారు. ఇంగ్లిష్ మాట్లాడలేక తెలుగు మీడియంలో చదివే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని రోజా అన్నారు. 
 
తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలను ఇంగ్లిష్ బాగా మాట్లాడాలని ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని రోజా అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టటం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉన్నత శిఖరాలకు చేరతారని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడులాగా మా వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఇంగ్లిష్ మాట్లాడి పరువు ఎవరూ తీయకూడదనే ఈ ప్రయత్నం చేస్తున్నామని రోజా అన్నారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, నాడు - నేడు, ఆంగ్ల మాధ్యమం మొదలైన కొత్త పథకాలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం బురద చల్లుతున్నాయని రోజా అన్నారు. సీఎం జగన్ తన పిల్లల్లా అందరూ స్థిరపడాలని కోరుకుంటున్నారని పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివి స్థిరపడాలని ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: