ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ గద్దెనెక్కిన తరువాత గన్ కల్చర్ ఒకింత ఎక్కువైందని, అలానే సామాన్యుల ప్రాణాలకు ముప్పు కూడా పెరిగిందని అక్కడి కొన్ని సంఘాలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక మరీ ముఖ్యంగా అక్కడి క్యాలిఫోర్నియా తదితర రాష్ట్రాల్లో ఇటీవల కొద్దిరోజలుగా జరుగుతున్న మాస్ గన్ ఎటాక్స్ అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. ఇకపోతే నేడు ఒక 16 ఏళ్ళ దుండగుడు ఏకంగా క్యాలిఫోర్నియా లోని శాంటా క్లారిటా ప్రాంతంలో గల సాగస్ హై స్కూల్ లో ప్రవేశించి, ఐదుగురు విద్యార్ధులపై కాల్పులు జరిపాడు. కాగా ఆ దుండగుడు ఆ స్కూల్ విద్యార్ధే అని కొందరు చెప్తున్నప్పటికీ, కాదనే వాదన కూడా వినపడుతోంది. సరిగ్గా మరికాసేపటిలో క్లాస్ లు మొదలవుతాయి అనగా, అంతకుముందే తన పుట్టినరోజుని సహ విద్యార్థులతో అతడు జరుపుకున్నట్లు సమాచారం. 

అనంతరం ఒక్కసారిగా తన జేబులో ఉన్న పిస్టల్ ని తీసి తోటి విదార్థులపై జాలి, దయ లేకుండా ఒకరి వెంట మరొకరిపై కాల్చడం మొదలెట్టాడు. అప్పటికే అతడి పిస్టల్ గుళ్ళు తగిలి ఇద్దరు మృత్యువాత పడగా, మిగతా ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే వారిని కాల్చిన అనంతరం వెంటనే చుట్టుప్రక్కల క్లాసుల నుండి పలువురు టీచర్లు పరుగెత్తుకుంటూ వస్తున్న సమయంలో దుండగుడు తనను తానే కాల్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా అతడు కూడా ప్రస్తుతం కొస ప్రాణంతో కొట్టుకుంటున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ దుండగుడి గురించి ఆరా తీయడం మొదలెట్టారు. అయితే అంతకుముందే అతడు తన గురించిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా తొలగించాడని, అతడికి తల్లి, సోదరి ఉన్నారని, 

కాగా ఇటీవల వారు జైలుపాలయ్యారని చెప్తున్నారు. అసలు అతడు ఈ హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తమకు అర్ధం కావడం లేదని, అతి త్వరలో అసలు నిజాలు బయటపెడతాం అని అంటున్నారు పోలీసులు. కాగా మరణించిన మరియు క్షతగాత్రులైన విద్యార్థుల తల్లితండ్రుల రోదనలతో ఆ స్కూల్ ఆవరణ మొత్తం మారుమ్రోగుతోంది. ఇకనైనా ఇక్కడ గన్ కల్చర్ పై అధ్యక్ధుడు ట్రంప్ అదుపు చేసేలా నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరింత పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: