మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడిచాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపి మధ్య  పొత్తు కుదిరినట్లు తాజా సమాచారం బట్టి అర్ధమవుతోంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ కు కట్టుబడి ఉండాలంటూ  కాంగ్రెస్ పెట్టిన షరతుకు శివసేన అధినేత ఉత్ధవ్ ఠాక్రే అంగీకరించటంతో పొత్తులు దాదాపు ఖరారైనట్లే అనుకోవాలి. నిజంగానే మూడు పార్టీలు పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండేట్లయితే ఐదేళ్ళ పాటు ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదనే అనుకోవాలి.

 

నిజానికి ఈ కొత్త పొత్తు పొడవటానికి ఎన్సీపి అధినేత శరద్ పవార్ చక్రం తిప్పారు. మూడు పార్టీల అధినేతల మధ్య చర్చల ప్రకారం ఐదేళ్ళు శివసేన అభ్యర్ధే ముఖ్యమంత్రి పీఠంపై ఉంటారు.  కాంగ్రెస్, ఎన్సీపిలకు చెరో ఉపముఖ్యమంత్రి పదవి దక్కబోతోంది. అలాగే అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ నేత ఉంటారు. శాసనమండలి ఛైర్మన్ గా ఎన్సీని నేత ఉంటారు. మంత్రివర్గంలో ఆయా పార్టీల బలాలను బట్టి నేతలు కుదురుకోవచ్చు. కాకపోతే కీలకమైన శాఖల కేటాయింపు ఎవరికి అన్న విషయంలో సస్పెన్స్ నడుస్తున్నట్లుంది.

 

మొత్తానికి పొత్తులతో పోటి చేసిన బిజెపి+శివసేన మిత్రత్వం చీలిపోయింది. సిఎం కుర్చీ కోసం రెండు పార్టీలు దేనికదే పట్టుబట్టడంతో చివరకు చీలిక తప్పలేదు. సిఎం కుర్చీ విషయంలో బిజెపి గనుక కాస్త మెత్తబడుంటే ఈ పాటికే వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 రోజులయ్యుండేదే.

 

 కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో మహారాష్ట్రలో బిజెపి చక్రం తిప్పుదామని అనుకున్నది. అయితే  సిక్కిం, మిజోరం లాంటి రాష్ట్రాల్లో తిరిగిన చక్రం మహారాష్ట్రలో తిరగకపోవటంతో బోల్తా పడింది. సరే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపి మధ్య ఒప్పందం కుదిరి ప్రభుత్వం ఏర్పడుతుంటే బిజెపి నోట్లో వేలేసుకుని  చూస్తు కూర్చుంటుందా ? చాన్సే లేదు. తనకున్న బలమంతా ఉపయోగించి ఏదో పద్దతిలో పొత్తులను చిత్తు చేసి రాష్ట్రపతి పాలన కంటిన్యు అవటానికే ప్రయత్నిస్తుందనటంలో సందేహం లేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: