పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల నేప‌థ్యంలో...ఆయా పార్టీలు త‌మ వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో, తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్‌పీపీ సమావేశానికి తొలిసారిగా హాజరైన  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు  పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతులపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ ఎంపీలకు సూచించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, పెండింగ్ అంశాలను లేవనెత్తాలని కోరారు. 


రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏర్పాటు చేయాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం, మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, ఐఐఎం లాంటి విద్యాసంస్థల ఏర్పాటు తదితర తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రుల ద్వారా, పార్లమెంట్‌లో ఫాలోఅప్ చేయాలని ఎంపీలకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా వంటి తక్షణ అవసరమైన అంశాలపై ఎంపీలు పనిచేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు గతంలో హామీ ఇచ్చారని, కానీ చాలాకాలంగా ఆ అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలాంటివాటిని ఫాలోఅప్ చేయాలని సూచించారు.తెలంగాణ ఏర్పడిన నాటినుంచి నేటివరకు అనేకమార్లు ప్రధానమంత్రి సహా కేంద్రమంత్రులు, అధికారులకు అనేక అంశాలపై వినతిపత్రాలు ఇచ్చామని, అవి కార్యరూపం దాల్చడంలేదని అన్నారు. వీటన్నింటిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. 


వివిధ శాఖలవారీగా తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లు, వినతుల జాబితాను పార్టీ ఎంపీలకు అందిస్తామని, తద్వారా వీటి పరిష్కారానికి కృషిచేసే క్రమంలో తెలంగాణ మంత్రులు, ఎంపీల మధ్య సమన్వయం సులభం అవుతుందని కేటీఆర్‌ చెప్పారు. పార్లమెంట్‌లో అంశాలవారీగా టీఆర్‌ఎస్ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్టీ నిర్ణయం ఉంటుందని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: