ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో హైకోర్టు చురకలు వేస్తున్న సంగతి తెలిసిందే.  హై కోర్టు చురకలు వేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  పైగా హైకోర్టులో వేసిన అఫిడవిట్ లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఇప్పటికే హైకోర్టు కోపగించుకుంది.  ఇక ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం కనుగొనే దిశగా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని దానిపై ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని అడగ్గా, దానికి ప్రభుత్వం అంగీకరించలేదు.  


కమిటీ ఏర్పాటును ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా సమ్మె చట్ట విరుద్ధం అని, కార్మికులపై ఎస్మా ప్రయోగించాలని చూస్తున్నట్టుగా ఉన్నది ప్రభుత్వం.  అంతేకాదు, 5100 రూట్లలో ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  దీనిపై సోమవారం రోజున దీనిపై కోర్టు ఓ నిర్ణయం  తీసుకోబోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు నుంచి వరసగా నిర్ణయాలు వెలువడుతుండటంతో హైకోర్ట్ వర్సెస్ ప్రభుత్వంగా మారుతున్నది.  


ఇప్పుడు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.  అదేమంటే..2018లో జరిగిన ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక గురించిన దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఈ పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై పలు సందేహాలను పిటిషనర్ వ్యక్తం చేస్తున్నారు.  వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల ఎన్నికకు సంబంధించి పిటిషన్ దాఖలైంది.  


దీంతో సదరు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపించింది.  నిన్నటి వరకు ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య ఆర్టీసీకి సంబంధించిన కేసులో చురకలు అంటిస్తూ వచ్చింది.  ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు దాఖలు కావడంతో కొత్త వివాదం నెలకొంది.  మరి ఈ వివాదం ఏ దిశగా మలుపులు తిరుగుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: