ఒక‌రి త‌ర్వాత ఒక‌రు టీడీపీని వీడేందుకు నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొన్న దేనినేని అనినాష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ..నెక్ట్స్ ఎవ‌రు... అంటూ టీడీపీ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఆయ‌న బీజేపీలోకి వెళ్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న జాతీయ‌స్థాయి ముఖ్య నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. 


ఇటీవల ఢిల్లీల్లో బిజెపి ప్రధాన కార్యదర్శి 'రామ్‌మాధవ్‌'ను కలసి రావ‌డంతో ఆయ‌న బీజేపీలో చేర‌డం దాదాపుగా ఖాయంగానే క‌నిపిస్తోంది. సుజానా చౌద‌రిలాంటి బీజేపీ నేత‌లు ఆ పార్టీలోకి ఎక్కువ మంది టీడీపీ నేత‌ల‌ను లాగేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాల్లో అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  వాస్త‌వానికి గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి...వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి ఎమ్మెల్యేల్లో  చాలా మంది మంది పార్టీ మారతారని ప్రచారం ప్రారంభమయింది. 


గెలిచిన 23 మందిలో దాదాపు 18 మంది వ‌ర‌కు పార్టీ మారేందుకే ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఎక్కువ మంది వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీలోకి ఇప్ప‌ట్లో ఎవ‌రిని ఆహ్వానించ‌బోమంటూ తేల్చిచెప్ప‌డంతో టీడీపీ ఎమ్మెల్యేలు వెన‌క్కు త‌గ్గార‌ని స‌మాచారం. అయితే ఇటీవ‌ల వ‌ల్ల‌భ‌నేని వంశీ నేరుగా క‌ల‌సి పార్టీలో చేర‌డంపై చ‌ర్చించి ఒకే అనిపించుకున్నారు. అయితే  ఆ త‌ర్వాత స్త‌బ్దుగా ఉండి స‌స్ప‌న్స్‌కు తెర‌లేపారు. 


చివ‌రికి గురువారం వంశీ టీడీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే దేవినేని అవినాష్ కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకున్నారు. అటు గంటా శ్రీనివాస‌రావు బీజేపీలో చేర‌డం ఖాయ‌మైంది. ఈ ప‌రిణామం త‌ర్వాత వీరు కాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, రాయలసీమకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఇదే దారిలో ఉన్నారంటూ పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది.  అదే జ‌రిగితే టీడీపీకి కోలుకోని దెబ్బ త‌గిలిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: