పవన్‌కు ఉన్నది... జూనియర్‌కు లేనిది ఏంటి? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్ధతిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇద్దరు తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్లే. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్ లో ఏ విషయంలోనూ పవన్ కంటే జూనియర్ తక్కువ కాదు. మరి అలాంటప్పుడు చంద్రబాబు పదే పదే పవన్ వెనుక ఎందుకు పడుతున్నారని జూనియర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


2009 ఎన్నికల్లో తన తాత పెట్టిన తెలుగుదేశం కోసమని చెప్పి ఎన్టీఆర్ జిల్లాలు జిల్లాలు తిరిగి ప్రచారం చేశారు. శ్రీకాకుళం నుండి ఖమ్మం వరకూ జూనియర్ చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక ప్రచారంలో ఉండగానే ఎన్టీఆర్ ఖమ్మం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయితే గాయపడిన ఆసుపత్రి బెడ్ మీద నుంచే టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. టీడీపీ రెండోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది.
అయితే ఇక్కడ నుంచే టీడీపీ, ఎన్టీఆర్ లకు మధ్య గ్యాప్ పెరగడం మొదలైంది.

ఈ గ్యాప్ తన కుమారుడు లోకేశ్ ఎదగడం కోసమో, లేక ఎన్టీఆర్ కు క్రేజ్ పెరుగుతుందో అనో గానీ చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీని దూరం పెట్టేశాడు. అటు ఎన్టీఆర్ కూడా పార్టీతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు. ఇక 2014 ఎన్నికలకు వచ్చేసరికి బాబు... పవన్ మద్ధతు కోసమని చెప్పి స్వయంగా ఆయన ఇంటికే వెళ్ళాడు.
తర్వాత పవన్ మద్ధతు ఇవ్వడం, ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగి ఓటమి పాలైంది. అయితే ఓటమి పాలైన దగ్గర నుంచి బాబు...పవన్ భజనే చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ని అభిమానించే టీడీపీ వర్గం అసంతృప్తిలో ఉంది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సన్నిహితుడుగా ఉన్న వల్లభనేని వంశీ కూడా పార్టీని వీడారు. అయితే పవన్ చుట్టూ భజన చేస్తున్న బాబు...ఒక్కసారి ఎన్టీఆర్ ని పిలిచి పార్టీకి మద్ధతు ఇవ్వమని ఎందుకు అడగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అడిగితేనే కదా ఆయన రాజకీయాల్లోకి వస్తారో ? లేదా సినిమాలు తీసుకుంటానని చెబుతారో ? తెలుస్తుందని అంటున్నారు.  ఏదేమైనా బాబు పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతోనే ఉన్నారు. రానున్న రోజుల్లోనైనా ఎన్టీఆర్ ని దగ్గరకు చేరదీయకపోతే అభిమానులు టీడీపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: