దాదాపు 50 రోజులుగా, తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో...కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ స‌మ్మెపై అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన ప్ర‌భుత్వం...కార్మికులతో చర్చలు జరపబోము.. డిమాండ్లు పరిష్కరించలేం అంటూ తేల్చేసింది. కేవలం కొందరు యూనియన్‌ నేతలు తమ స్వార్థం కోసం ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని, ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నందన.. ఈ సమ్మెను ఇల్లీగల్‌ అని ప్రకటించాలని ప్ర‌భుత్వం త‌ర‌ఫున దాఖ‌లు చేసిన అఫిడ‌విట్లో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. 


ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగులేకపోవడంతో.. కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని గుర్తు చేశారు. సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీకి 44శాతం నష్టం వచ్చిందని పేర్కొన్నారు. యూనియన్‌ నేతల స్వార్థం కోసం చేసే ఈ సమ్మె కారణంగా ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని..ప్ర‌స్తుతానికి యూనియన్‌ నేతలు విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినా.. మళ్లీ ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 


కాగా, కోర్టుకు అందించిన అఫిడ‌విట్‌పై ఆర్టీసీ నేత‌లు భ‌గ్గుమ‌న్నారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సీఎం కేసీఆర్ ఇచ్చిన అఫిడవిట్ వ‌లే ఉందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిప‌డ్డారు. సునీల్ శర్మ ఆర్టీసీ ఎండీ అయి 17 రోజులే అయిందని… అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదని ఆయ‌న‌ చెప్పారు. ఆయ‌న‌కు ఆర్టీసీ పై పూర్తి అవగాహన లేదని అశ్వత్థామ‌రెడ్డి తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్ పై ఎండీ సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని.. అది ఫక్తూ రాజకీయ అఫిడవిటేనని చెప్పారు. సమ్మె న్యాయ‌బ‌ద్ద‌మా కాదా అనేది కోర్టు తేలుస్తుంద‌ని అశ్వత్థామ‌రెడ్డి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: