ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో మనకు ఎన్నో రకరకాల సౌలభ్యలు అందుబాటులోకి వస్తున్నప్పటీకీ, వాటిని తప్పుడు పద్ధతుల్లో వాడి సమాజానికి చెడు చేస్తున్నారు కొందరు. ఇక ఇటీవల రోజురోజుకు సైబర్ నేరాలు మరింతగా పెరిగిపోతుండడంతో, అటువంటి కేసులను ఛేదించడం పోలీసులకు కూడా ఒకింత ఛాలెంజింగ్ గా మారుతోంది. కొన్నాళ్ల క్రితం మన ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేయడం, అలానే మన నెంబర్ కు ఫోన్ చేసి ఓటీపీ వంటివి అడిగి మన అకౌంట్ లో డబ్బు కాజేస్తున్న కేటుగాళ్లు, నేడు మరింత శృతిమించి, ఏకంగా మనకు తెలియకుండా మన పేరుమీద లోన్స్ తీసుకుని, అవి కట్టకుండా ఉడాయిస్తున్న ఘటన ఒకటి నేడు వెలుగులోకి వచ్చింది. 

ఇక ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డట్లైంది. ఇక వివరాల్లోకి వెళితే, ఢిల్లీ కేంద్రంగా కొందరు సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ కు చెందిన హిమాన్షు, గౌరవ కుమార్, దీపక్ కుమార్ అనే ముగ్గురిలో ఇద్దరి పేరిట ఢిల్లీలో ఒక బ్యాంక్ నుండి రుణం తీసుకున్నారు. ఒకరి పేరుపై రూ.13 లక్షలు, మరొకరి పేరుపై రూ.10 లక్షలు వారి పేర్లతో వున్న అసలు పత్రాలతోనే లోన్ తీసుకొని కట్టకుండా ఉడాయించారు. అనంతరం కొద్దిరోజులకు బాధితులకు ఫోన్లు చేసి రుణం కట్టాలని బ్యాంక్ సిబ్బంది అడగడంతో, ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ఆ ఇద్దరూ, తాము తీసుకోలేదని చెప్పి, అనంతరం పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ సైబర్ నేరగాళ్ల పని అని పోలీసులు పసిగట్టి, ఎట్టకేలకు ఆ నకిలీ కేటుగాళ్లని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరు ఇలా ఇప్పటికే రూ.73 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

కాగా ఈ సైబర్ నేరగాళ్లు వివిధ బ్యాంకులు డేటా ప్రొవైడర్స్ ను సంప్రదించి విలువైన వ్యక్తుల డేటాను కొంటున్నట్లు విచారణలో వెల్లడైందట. ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ లు సంపాదించి రుణాలు తీసుకొని రెండు నెలలు కట్టి ఆ తరువాత ఎగ్గొడుతున్నారు. ఇటువంటి చర్యల వలన అసలు బాధితులు బలైపోతున్నారు. ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజల సహా పోలీసులు కూడా ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు. కాగా ఇటువంటివి మనకు తెలిసి ఒకటి మాత్రమే వెలుగులోకి వచ్చిందని, తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో అని, కాబట్టి బ్యాంకు అధికారులు కూడా లోన్ తీసుకునే వ్యక్తులు అసలు వారేనా లేక కాదా అనే విషయమై ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే, ఇటువంటి ఘటనలకు కొంత చెక్ పెట్టవచ్చని పోలీసులు సూచిస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: