ప్రతి గ్రామంలో సాధారణంగా గుడిని ఇష్టదైవాలకు కట్టి పూజలు చేస్తుంటారు... అంతే కాకుండా రాళ్లకు, చెట్లకు, కొన్ని చోట్ల జంతువులకు కూడా గుడి కట్టి పూజలు చేయడం చూస్తూంటాం. కానీ ప్రతీ రోజు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తూ, నానా రోగాలను తగిలించి ప్రాణాలు హరించే ఓ జీవికి గుడి కట్టి పూజించటం వినడానికి వింతగా ఉంది ఇంతకు ఇదెక్కడ జరిగిందో తెలుసుకుందాం.


ఇకపోతే మనిషికి వచ్చే ఒక ఆలోచన ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతుందంటారు.ఇలాంటి ఆలోచనే ఓ గ్రామాన్ని బాగుచేసింది. అదేమంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రఖ్యాత శాస్రవేత్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం మోక్షగుండం ఇప్పుడు మరో విషయంలో దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. చుట్టూ నల్లమల అటవీ క్షేత్రంతో నిండి ఉండే గ్రామం చెట్లూ, కొండలతో నిండి ఉన్న ప్రాంతం అందువల్ల దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. 


అందువల్ల గ్రామంలో వైద్యశాఖ అధికారులు పారిశుద్యాన్ని పెంపొందించేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించ లేదు. పారిశుద్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆలోచనకు రూపమే దోమకు గుడి కట్టడం. 2007 లో మోక్షగుండం ప్రాధమిక వైద్యశాలలో డాక్టర్‌గా పనిచేసిన సతీష్‌ ఆస్పత్రిలో ఓ డెంగ్యూ కేసు నమోదు కావటంతో ఆ ప్రాంతంలోని ప్రజలకు దోమల గురించి తెలియజేసేందుకు దోమకు గుడిని ఏర్పాటు చేశారు.


వైద్యశాల ప్రాంగణంలోనే దోమ పుట్టవద్దు.. దోమ కుట్టవద్దు అనే నినాదంతో ఒక చిన్న గుడిని నిర్మించి వైద్యశాలకు వచ్చిన రోగులను ఆగుడి వద్దకు తీసుకుపోయి దోమ గురించిన విషయాలను చెప్పటం ప్రారంభించారు. అంతేగాక ఆ గ్రామంలోని పాఠశాలలో చదితే పిల్లలతో ప్రతి ఇంటిపై... ఓ దోమ రేపురా.. అంటూ ప్రత్యేకంగా రాయించి వారి తల్లిదండ్రులకు కూడా దోమల గురించిన విషయాలను తెలియ చెప్పారు.


డాక్టర్‌ ఏర్పాటు చేసిన గుడి గురించి తెలుసుకోవాలనే గ్రామస్తుల కుతుహలం పెరిగి ఆ గుడిని చూసేందుకు అక్కడకు వస్తుండటంతో సులువుగా దోమల వల్ల కలిగే నష్ఠాలను ప్రజలకు చేరవేయగలిగారు.. దీంతో గ్రామస్తులు తమ ఇండ్లనే కాకుండా పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవటం ప్రారంభించారు. నెగిటివ్‌ ప్రచారంతో డాక్టర్‌ సతీష్‌ గ్రామస్తులకు దగ్గరవడమే కాకుండా వారిని దోమల బెడద నుండి కూడా కాపాడారు.


ఇక గ్రామస్తులు ఆదే ఆనవాయితీని పాటిస్తూ దోమకు పూజలు చేస్తునే ఉన్నారు. పూజలు చేయటమే కాదు పరిసరాలను శుభ్రం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాదులతో ప్రాణాలు పోగుట్టుకుంటున్నా వారు మాత్రం ఆవ్యాదులకు దూరంగా ఉంటూ మరికొన్ని గ్రామాలకు ఆదర్శంగా మారుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: