మ‌హారాష్ట్రలో ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇటు పార్టీలు, అటు మహారాష్ట్ర గవర్నర్ కొష్యారీ ఉత్కంఠ‌ను పెంచుతున్నారు. భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు కలిగిన ఈ పార్టీలు కూటమి కట్టినా తమ నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి వెల్లడించడంలో మాత్రం వెనుకంజ వేశాయి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ తమ పార్టీ కోర్‌ కమిటీ నేతలతో ఆదివారం పుణెలో సమావేశం కానున్నారు. సోమ లేదా మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను కలుసుకుంటారని, ఆ తరువాత సోనియాతో భేటీ అవుతారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. 


ఎన్‌సీపీ,కాంగ్రెస్, శివసేన కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీల అధినేతలు ప్రకటించారు. ఇదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ కొష్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలతో సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిన గవర్నర్ హఠాత్తుగా భేటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎప్పుడూ నేతలతో సమావేశమవుతారనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నాయకులు శనివారం సాయంత్రం గవర్నర్‌ను కలువాలని ముందుగా నిర్ణయించిన భేటీ అర్థంతరంగా వాయిదా పడిందని శివసేన నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. గవర్నర్‌ను కలువాల్సిన ప్రతినిధి బృందంలోని సభ్యులందరూ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు పర్యటిస్తున్నారని చెప్పారు.


 


ఇదిలాఉండ‌గా, శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో సంచ‌ల‌న‌ వ్యాసాన్ని ప్రచురించింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఆరునెలలకు మించి ముందుకు సాగదంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలపై సామ్నా మండిపడింది. రాష్ట్రంలో ఏర్పడుతున్న నూతనరాజకీయ సమీకరణలు కొంతమందికి ‘కడుపునొప్పి’ కలిగిస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన మాటున ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని శివసేన ఆరోపించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ ధీమా వెనుక బేరసారాలకు పాల్పడాలన్న కుట్ర దాగి ఉన్నదని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: