చంద్రబాబుకు షాకుల మీద షాకులు అలా తగిలేస్తున్నాయి. ఓ విధంగా ఆయన ఎన్నికల ఫలితాల నుంచి షాకులకు బాగా అలవాటుపడిపోయారేమో చెప్పాలి. కొత్త సర్కార్ ఏర్పడి గట్టిగా ఆరు నెలలు కాలేదు, బాబు తన వద్ద ఉన్న అన్ని రకాలైన  అస్త్రాలు, ఆయుధాలు ఎడా పెడా  వాడేశారు. ఇక ఆయన ఓ వైపు అలిసిపోతుంటే  మరో వైపు తమ్ముళ్ళు కూడా  పార్టీకి  దండం పెట్టేస్తున్నారు. ఈ కధ ఇలా ఉండగానే జాతీయ పార్టీ అయిన  బీజేపీ కూడా బాబుకు షాకుల  మీద షాకులు ఇస్తోంది.


ఆ పార్టీ ఏపీలో బాబు టీడీపీనే టార్గెట్ చేసింది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చీల్చేసి ఏపీలో బీజేపీని ప్రధాన పక్షం చేద్దామనుకుని గట్టి వ్యూహాలను అమలుచేస్తోంది. ఇక మరో వైపు ఏపీ సీఎం గా జగన్ ఎటూ ఉన్నారు. ఆయన చేయాల్సింది చడీ చప్పుడు లేకుండా చేస్తున్నారు. ఇన్ని రకాల ఇబ్బందుల మధ్య బాబుకు ఒకే ఒక ఆశాదీపం ఏంటి అంటే మూడేళ్ళలో జమిలి ఎన్నికలు వస్తాయన్నది.


అయితే ఆ ఆశ కూడా ఇపుడు  తీరదు అంటున్నారు ప్రధాన ఎన్నికల అధికారి అరోరా. అది వట్టి అపోహ మాత్రమే. జమిలి ఎన్నికలపై ఇపుడు వస్తున్నవన్నీ వదంతులేనని సునిల్  ఆరోరా కొట్టిపారేశారు. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉంటేనే జమిలి ఎన్నికలకు రంగం సిధ్ధమవుతుందని కూడా సునీల్ ఆరోరా అంటున్నారు. దానికి సంబంధించి  పెద్ద కసరత్తే ఉందని కూడా ఆయన చల్లగా చెబుతున్నారు.


అన్ని పార్టీలు కూర్చుని చర్చించాలి. దాని మీద చట్ట సవరణ చేయాలి. ఇవన్నీ చాలా పెద్ద ప్రయత్నం. అన్నీ జరిగితేనే తప్ప జమిలి ఎన్నికల గురించి కనీసంగా కూడా ఆలోచించలేమని సునీలొ ఆరోరా తేల్చిపారేశారు. అంటే చంద్రబాబు జిల్లా సమీక్షల్లో తమ్ముళ్లకు చెబుతున్నట్లుగా మూడేళ్ళలో ఎన్నికలు ఉండవన్న మాట.  ఎన్నికలు జరిగేది కచ్చితంగా అయిదేళ్ళకు, అంటే 2024 ఏప్రిల్లోనే. ఈ సమాచారం కనుక తమ్ముళ్ళు వింటే మాత్రం టీడీపీలో మరెంతమంది మిగిలి ఉంటారో కూడా వూహించుకోవడం కష్టమే. మొత్తానికి అందరూ షాకులు ఇస్తూంటే చివరికి ఎన్నికల కమిషన్ కూడా బాబు ఆశలను అడియాశలు చేస్తూ గట్టి షాకే ఇచ్చేసింది. ఇక మరో నాలుగున్నారేళ్ళ పాటు టీడీపీని పడుతూ లేస్తూ చంద్రబాబు నడుపుకోవాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: